
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని ఆర్కేనగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీ నిమిత్తం ఉప ఎన్నిక నిర్వహించగా గురువారంతో పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయత్రం 5 గంటలకు ముగియగా 77.68 శాతం పోలింగ్ నమోదైంది. 2,28,234 మంది ఓటర్లు ఉండగా 51 పోలింగ్ కేంద్రాల పరిధిలో 258 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మొత్తం 59 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మధుసూదనన్ (అన్నాడీఎంకే), మరుదు గణేష్ (డీఎంకే), స్వతంత్ర అభ్యర్థి, అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన చేపడతారు. అదే రోజు మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడుతాయని భావిస్తున్నారు.