
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. గణేష్ నిమజ్జనాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా శుక్రవారం జీహెచ్‌ఎంసీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారంతోనే గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. మిగిలిన పండుగల కన్నా గణేష్ ఉత్సవాలు..నిమజ్జనాలు ప్రత్యేకంగా సాగుతాయన్నారు. అన్ని మతాలకు చెందిన వారు పరస్పర సహకరించుకుంటూ ఆనందంగా జరుపుకుంటారని చెప్పారు. పోలీసు, హెచ్‌ఎండిఏ, వాటర్ బోర్డు, విద్యుత్, ఇరిగేషన్, టూరిజం తదితర విభాగాలు సమన్వయంతో పనిచేసి గణపతి ఉత్సవాలను విజయవంతంగా సాగేలా చేశాయన్నారు. మెట్రో, ఎంఎంటిఎస్,ఆర్టీసీ మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాయని అభినందించారు.
పరస్పర సహకారంతోనే..
గణేష్ నిమజ్జనాలు విజయవంతం అయ్యేందుకు జీహెచ్‌ఎంసీ అన్ని సందర్భాల్లోనూ మంచి సహకారం అందించిందని నగర సీపీ అంజనీకుమార్ అన్నారు. నగర మౌలిక సదుపాయాల విషయంలో పరస్పర సహకారం ఎంతో అవసరమని చెప్పారు. ప్రతి నిమిషం సమన్వయంతోనే నిమజ్జన ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేశామన్నారు. ప్రజలు కూడా సహకరించారని తెలిపారు. గతంలో కొన్ని ఇబ్బందులు కలిగాయని..ఈ సారి చిన్నపాటి అసౌకర్యం కూడా లేకుండా ప్రశాంతంగా ఉత్సవాలు ముగిశాయన్నారు.
అన్ని విభాగాలు పూర్తి సహకారం..
గత నెలరోజులుగా నిమజ్జనానికి ఏర్పాట్లు చేయడంతో జీహెచ్‌ఎంసీ నిమగ్నమైందని..అన్ని విభాగాలు పూర్తి సహకారం అందించాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ అన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్నారు.