న్యూఢిల్లీ: అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే రైల్లోనూ విమానంలో ఉండే ప్రెషరైజ్డ్ కోచ్‌లను చూడొచ్చు. చైనా సరిహద్దుల్లో నిర్మిస్తున్న బిలాస్‌పూర్–మనాలి–లేహ్ మార్గంలో ప్రయాణించే రైళ్లలో ఇలాంటి బోగీలను ఏర్పాటుచేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే మార్గం ఇదే. కాబట్టి సముద్ర మట్టానికి సుమారు 5 వేల మీటర్ల ఎత్తులో వెళ్లే సమయంలో ప్రయాణికులు శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు రైల్వే శాఖ ప్రత్యామ్నాయ మార్గాలు వెదుకుతోంది. ఇందుకోసం విమానాల్లో ఉండే ప్రెషరైజ్డ్ కోచ్‌ల లాంటివి అయితే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తోంది. ఎక్కువ ఎత్తులో ప్రయాణికులు శ్వాస తీసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు విమానాల్లో ప్రెషరైజ్డ్ కోచ్‌లను ఏర్పాటుచేస్తారు. ప్రస్తుతం చైనాలోని క్వింగే–టిబెట్ రైల్వే లైనులోనే ఈ తరహా కోచ్‌లను వినియోగిస్తున్నారు. ఆక్సీజన్ పాళ్లు తక్కువగా ఉన్న వాతావరణంలో ప్రయాణికుల్ని తీసుకెళ్లేలా ఈ కోచ్‌లను డిజైన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment