విషాద యాత్ర | road Accident | Sakshi
Sakshi News home page

విషాద యాత్ర

Published Tue, Jun 3 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM

విషాద యాత్ర

విషాద యాత్ర

 బెంగళూరు, న్యూస్‌లైన్ : కాసేపట్లో దర్గాకు చేరుకుని, దైవ సమానులైన గురువుకు ప్రార్థనలు చేయాల్సి ఉంది. ఇంకేముంది అర గంటలో దర్గాకు చేరుకుంటున్నాం కదా అనుకుంటుండగానే... విధి వక్రించింది. గురువు సన్నిధిని కాకుండా దైవ సన్నిధిని చేరుకోవాల్సి వచ్చింది. గుల్బర్గ జిల్లా అళంద తాలూకా కోరహళ్లి క్రాస్ వద్ద సోమవారం వేకువ జామున కేఎస్ ఆర్టీసీ బస్సు, మ్యాక్సీ క్యాబ్‌లు ముఖాముఖి ఢీ కొనడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది అసువులు బాశారు. వారంతా ఉమ్మడి కుటుంబాలకు చెందిన వారు.
 
మృతులను మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా అక్కల్‌గూడ్‌కు చెందిన  నబీలాల్ అహ్మద్ హనీఫ్‌ముల్లా (58), మహబూబ్ బీ నబీలాల్ ముల్లా (55), రంజాన్ దాదాసాబ్ ముల్లా (25), గుడు మదర్‌సాబ్ ముల్లా (25), బాషా మదర్‌సాబ్ ముల్లా (60), సమీర్ ముల్లా (50), రెహానా షేక్ ముల్లా (30), మొహసీనా సికిందర్ (14), హుసేన్ మదరసా ముల్లా (30), మొమైత్ మహబూబ్ ముల్లా (35), నూర్‌జహాన్ రజాక్ (38), పర్వీన్ సికిందర్  ముల్లా (30), సమీరా ముల్లా (8), బావా జాన్ (32), మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ కమలాకర్ (38)లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన 12 మంది గుల్బర్గలోని జిల్లా ప్రధాన ఆస్పత్రి, అళందలోని ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
 
 వీరంతా ఆదివారం రాత్రి మాక్సీ క్యాబ్‌ను అద్దెకు తీసుకుని గుల్బర్గ సమీపంలోని ఖాజా బాందా నవాజ్ దర్గాకు బయలుదేరారు. అర్ధరాత్రి వరకు అందరూ ఉల్లాసంగా మాట్లాడుకుంటూ గడిపారు. అనంతరం నిద్రలోకి జారుకున్నారు. కొద్ది సేపట్లో క్యాబ్ దర్గాకు చేరుకోవాల్సి ఉండగా, హొస్పేట నుంచి అళంద తాలూకా జడగాకు వస్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు ఎదురుగా ఢీ కొంది. దీంతో రెండు వాహనాలు రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయాయి. 12 మంది అక్కడికక్కడే మరణించారు. ముగ్గురు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.  క్యాబ్‌లో ఉన్న 14 మంది, బస్సులోని ఐదు  మందికి గాయాలయ్యాయి.
 
బస్సు డ్రైవర్ రవి లింగశెట్టి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు మూడు గంటల పాటు శ్రమించి వాహనాలను వెలికి తీసి, మృతదేహాలను అళంద ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ రవి లింగశెట్టికి వరుసగా మూడు రోజుల పాటు డ్యూటీ చేస్తుండడం వల్ల నిద్రలోకి జారుకున్నాడని, అందువల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఖమరుల్ ఇస్లాం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి పరామర్శించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement