-కలబురిగి (గుల్బర్గా) నుంచి కల్వల మల్లికార్జున్‌రెడ్డి
హైదరాబాద్ కర్ణాటకలో అతిపెద్ద జిల్లా కలబురిగి (గుల్బర్గా)లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం జోరందుకుంది. ఈ నెల 10న ఎన్నికలు జరగనుండగా బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. కర్ణాటకకు గతంలో ఇద్దరు సీఎంలు వీరేంద్ర పాటిల్, ధరమ్‌సింగ్‌ను అందించిన కాంగ్రెస్ కలబురిగి జిల్లాపై పట్టు సాధించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే (కాంగ్రెస్–చిట్టాపూర్), దివంగత మాజీ సీఎం ధరమ్‌సింగ్ కుమారుడు అజయ్‌సింగ్ (కాంగ్రెస్–జీవర్గి), గుల్బర్గా ఎంపీ ఉమేశ్ జాదవ్ కుమారుడు అవినాశ్ జాదవ్ (బీజేపీ–చించోలి), బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలికయ్య గుత్తేదార్ (బీజేపీ–అఫ్జల్‌పూర్) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
గత ఎన్నికల్లో కలబురిగిపై బీజేపీ కాస్త పట్టు సాధించగా ఈసారి కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధించొచ్చని చెబుతున్నారు. అభ్యర్థుల గుణగణాలు, సామాజికవర్గ సమీకరణాలు, ధన ప్రవాహం కూడా ఎన్నికల్లో గణనీయ ప్రభావం చూపుతాయని ‘సాక్షి’క్షేత్రస్థా యి పరిశీలనలో తేలింది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీల పరిస్థితి ఇలా...
అఫ్జల్‌పూర్..
కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన అఫ్జల్‌పూర్ నియోజకవర్గంలో దిగ్గజ నేతలు ఎంవై పాటిల్ (కాంగ్రెస్), మాలికయ్య గుత్తేదార్ (బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు) పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించిన మాలికయ్య గుత్తేదార్ సొంత సోదరుడు నితిన్ గుత్తేదార్‌కు అధిష్టానం మొండిచే యి చూపడంతో స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగి కాంగ్రెస్, బీజేపీకి తీవ్ర పోటీనిస్తున్నారు.
1978లో జనతా, 2004లో జేడీ(ఎస్), 2018లో కాంగ్రెస్ తరఫున ఎన్నికైన ఎంవై పాటిల్ మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 1985 నుంచి 2013 వరకు ఆరుసార్లు కాంగ్రెస్ నుంచి గెలిచిన మాలికయ్య గుత్తేదార్ 2018లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శివకుమార్ నటేకర్ ప్రచారం ఇంకా పుంజుకోలేదు.
జీవర్గి..
కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందిన జీవర్గిలో ప్రాతినిధ్యం కోసం బీజేపీ ప్రయతి్నస్తోంది. 1972 నుంచి 2004 వరకు వరుసగా ఎనిమిదిసార్లు కాంగ్రెస్ నుంచి ధరమ్‌సింగ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2013, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ధరమ్ సింగ్ చిన్న కుమారుడు డాక్టర్ అజయ్ సింగ్ మూడోసారి పోటీ చేస్తున్నారు. 2008లో ధరమ్ సింగ్‌పై గెలిచిన బీజేపీ నేత ‘దొడ్డప్పగౌడ శివలింగప్పగౌడ్ పాటిల్ నారిబోల్‌కు టికెట్ నిరాకరించడంతో జేడీ(ఎస్) తరపున పోటీ చేస్తున్నారు.
సేడం..
తెలంగాణ సరిహద్దులో ఉన్న సేడంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ పాటిల్ మళ్లీ బరిలో నిలవగా గతంలో మూడుమార్లు ఎమ్మెల్యేగా పనిచేసి 2018 ఎన్నికలో ఓడిన శరణ్ ప్రకాశ్ పాటిల్ వరుసగా ఐదోసారి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. రాజ్‌కుమార్ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలో పర్యటిస్తున్న జేడీ(ఎస్) అభ్యర్థి బాలరాజు గుత్తేదార్ బలమైన అభ్యర్తిగా తెరమీదకు వచ్చారు. గాలి జనార్దన్‌రెడ్డి మేనల్లుడు, కల్యాణ రాజ్య ప్రగతిపక్ష అభ్యర్థి జి.లల్లేశ్ రెడ్డి కూడా విస్తృత ప్రచారం చేస్తున్నారు.
చించోలి (ఎస్సీ)..
గుల్బర్గా బీజేపీ ఎంపీ డాక్టర్ ఉమేశ్ జాదవ్ కుమారుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే అవినాశ్ జాదవ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. గతంలో మల్లికార్జున ఖర్గేకు అనుచరుడైన ఉమేశ్ జాదవ్ 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి 2019లో గుల్బర్గా స్థానం నుంచి ఖర్గేపై బీజేపీ ఎంపీగా గెలుపొందారు. చించోలి నియోజకవర్గం బీదర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉండటంతో ఉమేశ్ జాదవ్ దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. దీంతో అవినాశ్ జాదవ్‌కు కాంగ్రెస్ అభ్యర్థి సుభాష్ వి. రాథోడ్ గట్టిపోటీనిస్తున్నారు.
గుల్బర్గా రూరల్ (ఎస్సీ)..
బీజేపీ ఎమ్మెల్యే బస్వరాజ్ మత్తిమూడ్, కాంగ్రెస్ అభ్యర్థి రేవు నాయక్ బెలమాగి నడుమ పోటీ సాగుతోంది. ఇక్కడ జేడీ (ఎస్) ఎన్నికల అవగాహనలో భాగంగా సీపీఎంకు మద్దతిస్తోంది. సీపీఎం తరఫున పాండురంగ్ మావింకర్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రేవు నాయక్ 2008లో బీజేపీ, 2018లో జేడీ(ఎస్), ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. తరచూ పార్టీలు మారడంతో ఆయనకు కొంత ప్రతికూలత కనిపిస్తోంది.
అలంద్..
సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్ గుత్తేదార్ బీజేపీ నుంచి, మాజీ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. జేడీ(ఎస్) మహిళా అభ్యర్థి మహేశ్వరి వలేను బరిలోకి దింపింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులిద్దరూ పాతవారే కావడంతో రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
చిట్టాపూర్ (ఎస్సీ)..
మల్లికార్జున ఖర్గే కుమారుడు, మాజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే వరుసగా నాలుగోసారి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. 2009 ఉప ఎన్నికలో ఓడిన ప్రియాంక్ తిరిగి 2013, 2018లో గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. బీజేపీ తరఫున మణికంఠ రాథోడ్ పోటీ చేస్తుండగా, సుభాష్ చంద్ర రాథోడ్ జేడీ(ఎస్) నుంచి బరిలో ఉన్నారు. కరోనా వేళ సామాజిక సేవలో నిమగ్నమైన జేడీ (ఎస్) అభ్యర్థి సుభాష్ చంద్ర రాథోడ్‌పై సానుకూలత ఉంది.
Comments
Please login to add a commentAdd a comment