బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక అంత తేలికగా ముగిసేలా కనిపించడంలేదు. సీఎం అభ్యర్థిని నిర్ణయించే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకే నూతన ఎమ్మెల్యేలు కట్టబెట్టారు. ఆదివారం సాయంత్రం బెంగళూరులోని ఓ హోటల్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయానికి కారకులైన నాయకులు, కార్యకర్తలు, కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తొలుత పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది.
అనంతరం సీఎం ఎంపిక అధికాన్ని ఖర్గేకు అప్పగిస్తూ మాజీ సీఎం సిద్దరామయ్య ప్రవేశపెట్టిన ఏక వాక్య తీర్మానాన్ని కూడా ఎమ్మెల్యేలు ఆమోదించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. అధిష్టానం తరఫున ఖర్గే నియమించిన ముగ్గురు పరిశీలకులు సీఎం అభ్యర్థిపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటారని చెప్పారు.
ఆదివారం ఈ తతంగం పూర్తి చేసి సోమవారానికల్లా ఖర్గేకు వారు నివేదిక అందజేస్తారన్నారు. ఖర్గే నియమించిన పరిశీలకుల కమిటీలో మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్, ఏఐసీసీ మాజీ కార్యదర్శి దీపక్ బబారియా ఉన్నారు. వీరు, వేణుగోపాల్ అంతకుముందు సీఎం రేసులో ఉన్న సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు.
చదవండి: ఓవర్ టు రాజస్తాన్
కార్యకర్తల హడావుడి
సీఎల్పీ భేటీ జరిగిన హోటల్ బయట కాంగ్రెస్ కార్యకర్తల హడావుడి కనిపించింది. సిద్దరామయ్య, శివకుమార్ వర్గీయులు బ్యానర్లు, జెండాలు చేతబూని తమ నేతే సీఎం అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు ఇద్దరు నేతలు తమకు మద్దతు తెలిపే ఎమ్మెల్యేలతో వేర్వేరుగా భేటీలు జరిపారు. రెండు వర్గాలు పోటాపోటీగా పోస్టర్లు వేశాయి. ఇద్దరు నేతల నివాసాల వద్ద కూడా పోస్టర్లు కనిపించాయి. ఎన్నికలకు ముందు పార్టీ నేతలను ఒకే తాటిపైకి తేవడంలో సఫలీకృతమైన కాంగ్రెస్ పార్టీ ఫలితాల తర్వాత అదే ఐక్యతను కొనసాగించడానికి ఇబ్బందులు పడుతోంది. కర్ణాటక అసెంబ్లీ గడువు ఈ నెల 24తో ముగియనుంది. తాజా ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ సాధించిన కాంగ్రెస్ ఆలోపు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment