కలబురిగి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసిన వేళ కర్ణాటక ప్రజలనుద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. సోమవారం కలబురిగిలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘నన్నెవరైనా చంపితే చంపొచ్చు గాక! తుదిశ్వాస దాకా పేదల కోసం, వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటా’’ అని స్పష్టం చేశారు. ‘‘నేను కన్నడ భూమిపుత్రున్ని. అందుకు ఎంతగానో గర్వపడతా’’ అన్నారు.
ఖర్గేను, ఆయన భార్యాపిల్లలను చంపేందుకు బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ కుట్ర పన్నారని కాంగ్రెస్ ఆరోపించడం, అందుకు రుజువుగా ఆడియో రికార్డు విడుదల చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. అది కచ్చితంగా బీజేపీ అగ్ర నేతల మనసు లోంచి పుట్టుకొచ్చిన ఆలోచనే అయ్యుంటుందని ఆరోపించారు. వారి దన్ను లేనిదే ఎవరూ అలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. ‘‘చిన్నతనంలోనే కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకుని ఒంటరిగా మిగిలాను. వాళ్లేమైనా చేసుకోవచ్చు.
కానీ ఇలాంటి బెదిరింపులకు భయపడను. నన్ను కాపాడేందుకు అంబేడ్కర్ అందించిన రాజ్యాంగముంది. కర్ణాటక ప్రజలంతా నా వెనక ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాక దేశ ప్రజలంతా నా వెనకే ఉన్నారు. మన దేశంలో సగటు ఆయు ప్రమాణం 70 ఏళ్లే. నాకు 81 ఏళ్లు. అంటే ఇప్పటికే బోనస్ పీరియడ్‌లో ఉన్నా. మహా అయితే మరో ఎనిమిదేళ్లు బతుకుతానేమో. నన్నూ, నా కుటుంబాన్నీ తుడిచి పెట్టొచ్చు గాక. భయపడేది లేదు. నా స్థానంలో మరొకరు పుట్టుకొస్తారు’’ అన్నారు.
‘‘ప్రధాని మోదీ కూడా పదేపదే నా కుమారుని గురించి మాట్లాడుతున్నారు. అతనిది మోదీ స్థాయి కాదు. నా గురించి మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. ‘‘తాను భూమిపుత్రున్నని గుజరాత్‌లో మోదీ చెప్పుకుంటారు. తన కోసం బీజేపీని గెలిపించాలని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను కోరారు. అలాగే కర్ణాటక భూమిపుత్రుడినైన నా కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరుతున్నా’’ అన్నారు. తాను కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉండగా రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సహకరించాలని కోరారు.
బెంగళూర్లో రాహుల్ బస్సు ప్రయాణం
బనశంకరి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ బెంగళూరులో హల్‌చల్ చేశారు. కన్నింగ్‌హాం రోడ్డులో కాఫీ డేలో కాసేపు గడిపారు. అక్కడ కాఫీ రుచి చూశాక దగ్గర్లోని లోకల్ బస్టాప్‌లో కాలేజీ విద్యార్థులు, వర్కింగ్ విమెన్‌తో మాటలు కలిపారు. స్టూడెంట్లతో సెల్ఫీ దిగారు. తర్వాత లోకల్ బస్సెక్కి ప్రయాణికురాళ్లతో మాట్లాడారు. లింగరాజపురంలో బస్సు దిగి బస్టాప్‌లో మహిళలతో మరోసారి ముచ్చటించారు. ‘ధరల పెరుగుదల, ఇంటి పెద్ద అయిన ప్రతి మహిళకూ నెలకు రూ.2,000 ఇస్తామన్న కాంగ్రెస్ హామీ, ఉచిత బస్సు ప్రయాణం తదితరాలపై వారు నాతో లోతుగా చర్చించారు’’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment