
రాయగడ సరిహద్దులో రైలు పట్టాలపై పులిసంచారం,అడవిలోకి వెళ్తున్న పులి
రాయగడ: ఒడిశాలోని రాయగడ–కొరాపుట్, నవరంగ్‌పూర్, కలహండి, గజపతి, జిల్లాలకు సంబంధించిన అడవికి రాయల్‌బెంగాల్ అభయారణ్యంగా గుర్తింపు ఉండేది. గత 50సంవత్సరాలుగా ఈ అడవుల్లో పులుల అక్రమ రవాణా ముఠా, వేటగాళ్ల వల్ల పులుల సంతతి సంపూర్ణంగా అంతరించిపోయింది. ప్రసిద్ధి చెందిన రాయల్‌బెంగాల్ టైగర్ వంశం 10సంవత్సరాల క్రితం అంతరించిపోయినట్లు అటవీశాఖ భావించింది. 10సంవత్సరాలలో రాయగడ జిల్లా సరిహద్దుల్లో గానీ, రాయగడ జిల్లా అడవిలో కానీ సాధారణ పులులు తప్ప రాయల్‌బెంగాల్ టైగర్ సంతతి ఉన్నట్లు ఏ సర్వేలో కూడా తెలియరాలేదు.
కానీ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో రాయగడ, కలహండి జిల్లా సరిహద్దుల్లో రైలు పట్టాలపై రాయల్ బెంగాల్ టైగర్ కనిపించినట్లు వాట్సాప్‌ల ద్వారా తెలియవచ్చింది. ఇది తెలిసిన వెంటనే రాయగడ జిల్లా అటవీశాఖ అధికారులు జిల్లా సరిహద్దు అడవిలో రాయల్ బెంగాల్ టైగర్ కాలిముద్రలను గుర్తించేందుకు ప్రత్యేక బృందం బయల్దేరింది. జిల్లా సరిహద్దులో గత 10సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారిగా ప్రజల దృష్టికి రాయల్‌టైగర్ కనిపించిది. 10సంవత్సరాల క్రితం అటవీశాఖ అధికారులు జంతువుల జనాభా లెక్కల్లో రాయగడ జిల్లా అడవిలో 3పులులు ఉన్నట్లు గుర్తించారు. కానీ అవి ఏ జాతి పులులన్నది తెలియరాలేదు.