సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఏసీ గార్ట్స్ ప్రాంతానికి చెందిన ప్రముఖ హంటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ సుదీర్ఘ విరామం తర్వాత మరో ఆపరేషన్ చేపట్టారు. బీహార్‌లోని వాల్మీకి టైగర్ రిజర్వ్ (వీటీఆర్) ఫారెస్ట్‌లో మ్యానీటర్‌గా మారిన రాయల్ బెంగాల్ టైగర్‌ను శనివారం హతమార్చారు. మూడేళ్ల వయస్సున్న ఈ మగ పులి గడచిన ఆరు నెలల్లో పది మందిని పొట్టన పెట్టుకుంది. గత నెల 27న చేపట్టిన ఆపరేషన్‌లో షఫత్ అలీ ఖాన్ తొలుత ఆ పులికి మత్తు మందు ఇచ్చి పట్టుకోవడానికి ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో పాటు శుక్రవారం తల్లీకుమారుడిని ఆ పులి చంపేయడంతో బీహార్ పోలీసు కమాండోలతో కలిసి దాన్ని కాల్చి చంపారు. అలీ ఖాన్‌కు గతంలో దేశ వ్యాప్తంగా ఎన్నో మ్యానీటర్లు, మదగజాలను చంపిన, బంధించిన రికార్డు ఉంది. ఈ పులితో కలిపి ఇప్పటి వరకు ఆయన మొత్తం 17 మ్యానీటర్లను చంపారు. కొన్ని ఆపరేషన్స్‌లో ఆయన కుమారుడు అస్ఘర్ అలీ ఖాన్ సైతం పాల్గొన్నారు.
► వీటీఆర్ అడవిలో ఓ రాయల్ బెంగాల్ టైగర్ ఆరు నెలల క్రితం మ్యానీటర్‌గా మారింది. దీని బారినపడి గత నెల ఆఖరి వారం వరకు ఆరుగురు చనిపోగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆ పులిని బంధించడానికి బీహార్ అటవీ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వాళ్లు తమకు సహకరించాల్సిందిగా షఫత్ అలీ ఖాన్‌ను కోరారు.
► బీహార్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ ప్రభాత్ కుమార్ ఆహ్వానం మేరకు అలీ ఖాన్ గత నెల 27న అక్కడికి వెళ్లి ఆపరేషన్ చేపట్టారు. ప్రస్తుతం వీటీఆర్ ఫారెస్ట్‌లో మొత్తం 40 పులులు, 9 కూనలు ఉన్నాయి. దీంతో ఆ అడవి వాటికి ఇరుకుగా మారి అనేక ఆడ పులులు బయటకు వస్తున్నాయి. సమీపంలోని మాస నది ఒడ్డున ఉన్న చెరుకు పొలాల్లో పిల్లలను కంటున్నాయి. ఇలాంటి వాటిలో కొన్ని కూనలు తిరిగి అడవిలోకి వెళ్లకుండా పొలాలు, ఊర్ల సమీపంలో తిరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే మూడేళ్ల వయస్సున్న ఓ మగ పులి ఆరు నెలల క్రితం అనుకోకుండా పొలాల్లోకి వచ్చిన ఓ యువకుడిని చంపింది. అప్పటి నుంచి మ్యానీటర్‌గా మారి అవకాశం దొరికినప్పుడల్లా గ్రామస్తులపై దాడి చేసి హతమారుస్తోంది. శుక్రవారం ఉదయం వరకు కలిపి మొత్తం పది మందిని చంపేయడంతో పాటు మరో ముగ్గురిని తీవ్రంగా గాయపరిచింది. గత నెల ఆఖరి వారంలో రంగంలోకి దిగిన షఫత్ అలీ ఖాన్ ఆ పులికి మత్తు మందు ఇచ్చి పట్టుకోవడానికి, సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్ల వదలడానికి ఈ ఆపరేషన్ చేపట్టారు. దీనికోసం పట్నా జూకు చెందిన బృందంతో కలిసి పని చేసినా ఫలితం దక్కలేదని, ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం షఫత్ అలీ ఖాన్‌తో కలిసి బీహార్ పోలీసుల కమాండోలు దాన్ని హతమార్చారు అని అక్కడి అటవీ శాఖ ప్రకటించింది.
చదవండి: టప్పాఖానాలకు కొత్త రూపు
Comments
Please login to add a commentAdd a comment