‘పద్మనాభ ఆలయం’పై జాగ్రత్త
సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: కేరళలోని ప్రఖ్యాత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ ముసురుకున్న వివాదాలు, అవకతవకలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘అక్కడ కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. వాటిలో కొన్ని అత్యంత తీవ్రమైన అంశాలున్నాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సరిదిద్దండి’ అని న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.ఎం. లోధా, జస్టిస్ ఎ.కె. పట్నాయక్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
పద్మనాభ స్వామి ఆలయ యాజమాన్యం నిబంధనల ఉల్లంఘన, ఆలయ సంపద వంటి అంశాలపై సీనియర్ అడ్వొకేట్ గోపాల సుబ్రమణియం ఈ నెల 15న సమర్పించిన నివేదికపై విచారణ ప్రారంభించిన ధర్మాసనం పైవిధంగా ఆదేశించింది. ఈ సందర్భంగా అమికస్ క్యూరీగా కోర్టుకు హాజరైన సుబ్రమణియం.. ఆలయంలో జరిగే రోజువారీ కార్యకలాపాల్లో ప్రస్తుత ధర్మకర్త, ఆయన కుటుంబ సభ్యుల ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయానికి అడ్డుకట్ట పడేలా మార్గదర్శనం చేయాలని కోర్టును కోరారు. ఆలయానికి స్వతంత్ర యాజమాన్యాన్ని ఏర్పాటు చేయాలని అప్పుడే అధికారులు వారి కార్యకలాపాలను స్వతంత్రంగా చేయగలుగుతారని పేర్కొన్నారు. ఆలయ సంపదలున్న పెట్టెలకు వేసిన తాళాలు, సీళ్లు తొలిగిపోయిన స్థితిలో కనిపించాయని చెప్పారు. సుబ్రమణియం ఇచ్చిన నివేదికపై ట్రావెన్‌కోర్ రాజ కుటుంబం తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ అడ్వొకేట్ కె.కె. వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నివేదికలోని అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తులు నివేదికలోని అంశాలపై స్పందిం చేందుకు కేరళ ప్రభుత్వం సహా ట్రావెన్‌కోర్‌కు కూడా అవకాశం ఇస్తామని, సుబ్రమణియం వెల్లడిస్తున్న అంశాలను తక్షణమే వినాల్సిన అవసరం ఉంద న్నారు. ‘మా వరకూ ఇది అత్యంత తీవ్రమైన అం శం. మీ వాదనలూ వినేందుకు మేం సిద్ధం’ అంటూ విచారణను గురువారానికి వాయిదా వేశారు.