రైలు నుంచి ప్రయాణికులను తోసేసిన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్
వారణాసి: డబ్బులడిగితే ఇవ్వలేదని ఓ ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ప్రయాణికులపై దాష్టీకానికి పాల్పడ్డాడు. కదులుతున్న రైలు నుంచి ఇద్దరిని బయటకు తోసేశాడు. వారిలో మహిళ మరణించగా, ఆమె సోదరుడు గాయపడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దుర్ఘటన మంగళవారం రాత్రి వారణాసి రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. మృతురాలు పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాకు చెందిన రీతా పాల్(25)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ శరద్‌చంద్ర దూబేను పోలీసులు అరెస్టు చేశారు.
తన 18 నెలల కూతురు కాజల్, సోదరుడు జయ్‌దేవ్, మామ మానిక్ పాల్‌లతో కలిసి భర్తను కలవడానికి రీతా పాల్ దుర్గియానా ఎక్స్‌ప్రెస్‌లో హౌరా నుంచి కాన్పూర్‌కు బయలుదేరింది. వారున్న బోగీలోకి ప్రవేశించిన కానిస్టేబుల్ దూబే వారి టికెట్లను పరిశీలించాడు. జనరల్ బోగీ టికెట్లతో స్లీపర్ బోగీలో ప్రయాణిస్తుండటాన్ని తప్పుపట్టి డబ్బులిమ్మని బలవంతం చేశాడు. డబ్బులివ్వడానికి నిరాకరించిన వారు జనరల్ బోగీలో సీట్లు ఖాళీ లేక ఇక్కడ కూర్చున్నామన్నారు. అంతకు ముందే వేరే కానిస్టేబుల్ వచ్చి రూ. 50 జరిమానా వసూలు చేశాడని చెప్పారు. అయినా వినిపించుకోని దూబే కదులుతున్న రైలు నుంచి పాల్, జయ్‌దేవ్‌లను బయటకు తోసేశాడు. రీతా పాల్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా ఆమె ఆ రాత్రే మరణించింది.
డబ్బులివ్వలేదని...
Published Fri, Jan 30 2015 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM
Advertisement
Advertisement