రూ. 1.3 కోట్ల అప్పు వివాదంలో ముఖ్యమంత్రి!
బెంగళూరు: గత కొద్దిరోజులుగా తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఇబ్బందుల పాలవుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. బెంగళూరు టర్ఫ్ క్లబ్(బీటీసీ) కు స్టివార్డ్‌గా ఓ వ్యాపారవేత్తను ఆయన నామినేట్ చేయడం వివాదంగా మారింది. అతనితో సిద్దరామయ్యకు గతంలో లావాదేవీలు ఉన్నాయని, అందుకు ప్రతిఫలంగానే పదవిని కట్టబెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సామాజిక కార్యకర్త ఎస్ భాస్కరన్ కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా ను కోరారు. నామినేషన్ వేసిన ఎల్ వివేకానందతో సీఎం సిద్దరామయ్యకు రూ.1.3 కోట్ల రుణ లావాదేవీలు జరిగినట్లు తెలిపారు.
ఎల్ వివేకానందను బీటీసీ కమిటీ స్టివార్డ్‌గా ప్రభుత్వం తరఫు నుంచి నామినేట్ కావడాన్ని తాను ఒక పౌరుడిగా ప్రశ్నిస్తున్నానని భాస్కరన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది జరిగిన కొద్ది నెలలకే వివేకానంద నుంచి సీఎం సిద్దరామయ్య రూ.1.3 కోట్ల రుణం తీసుకున్నారని, అందుకు సంబంధించిన పత్రాలను పిటిషన్‌కు జతచేస్తూ ఆయన గవర్నర్ కు పంపారు. ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు లేదా ఏదేనీ ఇతర లావాదేవీల కోసం తన అధికారాన్ని దర్వినియోగం చేయకూడదని నిబంధనల్లో ఉందనీ.. కానీ, సీఎం వాటిని ఉల్లఘించినట్లు ప్రస్తావించారు. మే 2013 నుంచి టర్ఫ్ క్లబ్ కమిటీ విషయాలను ఆర్టీఐ ద్వారా స్వీకరించినట్లు తెలిపారు.
ఈ ఆరోపణలపై స్పందించిన వివేకానంద తాను టర్ఫ్ క్లబ్ లో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నానని చెప్పారు. సీఎంతో ఆర్ధిక లావాదేవీలు పెట్టుకున్నాననే వార్తలు అవాస్తవమని ఆయన అన్నారు. గత ఏడాది తన స్నేహితుడు (సీఎం) చెక్ తీసుకున్నారని, త్వరలోనే వాటిని తిరిగి ఇచ్చేస్తారని వివరించారు. గతంలో తాను రెండేళ్ల పాటు మైసూర్ రేస్ క్లబ్ కు చైర్మన్ గా వ్యవహరించానని, బీటీసీలో మెంబర్ గా ఉన్నానని తెలిపారు. తనను బీటీసీ స్టివార్డ్‌గా నామినేట్ చేయడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు.