కోటిన్నర పరిహారం!
హిమాచల్ ప్రదేశ్ః మండి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ మహిళా డాక్టర్ కుటుంబానికి కారు యజమాని, బీమా సంస్థ సంయుక్తంగా కోటిన్నర రూపాయల వరకూ పరిహారం చెల్లించాలని హిమాచల్ ప్రదేశ్ లోని మండి అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ సూచించింది. 2012 లో మండినుంచి సిమ్లా ఓ ప్రైవేట్ కారులో ప్రయాణిస్తున్న డాక్టర్ రూబీ బింద్రా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా యాక్సిడెంట్ లో చనిపోయింది. రూబీ మరణంపై కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన కోర్టు... కారు యజమాని, ఇన్సూరెన్స్ కంపెనీ కలసి బాధితులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
వృత్తిరీత్యా వైద్యురాలైన 37ఏళ్ళ రూబీ బింద్రా సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసేది. విధులకు హాజరయ్యేందుకు ఆమె ప్రతిరోజూ మండి నుంచీ సిమ్లా కారులో ప్రయాణించేది. అదే నేపథ్యంలో 2012 అక్టోబర్ 22న తన పిల్లలతో కలసి సిమ్లా వెడుతున్న రూబీ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్..యజమాని అయిన ఖజన్ సింగ్ నిర్లక్ష్య డ్డ్రైవింగ్ తో యాక్సిడెంట్ కు గురైంది. ప్రమాదంలో డాక్టర్ రూబీ బింద్రా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ప్రమాదంపై రూబీ కుటుంబ సభ్యులు కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ రూబీ మైనర్ సంతానమైన కుమారుడు త్రిష్ శర్మ, కుమార్తె హనవ్ శర్మల తోపాటు భర్త అరవింద్ శర్మలకు 1.48 కోట్ల రూపాయల పరిహారాన్ని మండి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీతోపాటు, కారు యజమాని అందించాలని న్యాయమూర్తి మదన్ కుమార్ ఆదేశించారు. పిటిషన్ ఫైల్ చేసిన రోజు నుంచి 9 శాతం వడ్డీతో సహా పరిహారం చెల్లించాలని వివరించారు.
2012 లో మోటార్ వెహికిల్ యాక్ట్ 166 కింద డాక్టర్ రూబీ కుటుంబ సభ్యులు పరిహారంకోసం క్లైం పిటిషన్ దాఖలు చేశారు. అయితే డాక్టర్ రూబీ అప్పటికే రోగి అని, ప్రైవేట్ కారులో ప్రయాణిస్తున్న ఆమె మరణానికి ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత వహించదని, ఎటువంటి పరిహారం చెల్లించేది లేదని నేషనల్ ఇన్పూరెన్స్ కంపెనీ తెలిపింది. కాగా కారులో ప్రయాణించిన వ్యక్తి రోగి కాదని, కారు కూడ బీమా చేసి ఉందని తెలుపుతూ అన్ని పత్రాలను ప్రత్యర్థులు కోర్టుకు సాక్ష్యాధారాలను సమర్పించారు. దీంతో విచారించిన కోర్టు కారులో ప్రయాణించిన డాక్టర్ యాక్సిడెంట్ లో చనిపోయే సమయానికి నెలకు 93.139 రూపాయల వేతనాన్ని పొందుతోందని, అనేక సాక్ష్యాధారాలతోపాటు, సుప్రీంకోర్టు తీర్పులను సైతం పరిశీలించి... జరిగిన నష్టానికి ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత వహించాల్సిందేనని సూచించింది. ఇద్దరు పిల్లల్లో ఒక్కొక్కరికి 45 శాతం చొప్పున, భర్తకు 10 శాతం చొప్పున కోర్టు ఆర్డర్ జారీ చేసిన 45 రోజుల్లోపల పరిహారం చెల్లించాలని తెలిపింది.