సాక్షి, భువనేశ్వర్: ఒడిశాలోని రూర్కెలాలో ఒక జాతీయ బ్యాంకులోకి సాయుధులైన దొంగలుబ్యాంకు దోపిడీకి తెగబడ్డారు. నగరంలో అత్యంత రద్దీగాఉండే మధుసూదన్ లేన్ ప్రాంతంలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐవోబీ) శాఖలో పట్టపగలు చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. తుపాకులతో హల్‌చల్ చేశారు. మారణాయుధాలతో బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు సిబ్బందిని, వినియోగదారులకు భయభ్రాంతులకు గురిచేశారు. క్యాషియర్‌ను బెదిరించి భారీ ఎత్తును సొమ్మును దోచుకుపోయారు.
పోలీసులు, బ్యాంకు అధికారులు అందించిన సమాచారం ప్రకారం మంగళవారం ఉదయం బ్యాంకు కార్యక్రమాలు ప్రారంభమైన కొద్దివసేపటికే దొంగలు బ్యాంకుపై ఎటాక్ చేశారు. ముఖాలకు మాస్క్‌లు, హెల్మెట్‌లు ధరించి ఆరుగురు దోపిడీ దొంగలు మారణాయుధాలతో బ్యాంకులోకి ప్రవేశించారు. ముందు సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు సిబ్బందిని, బ్యాంకులోని వినియోగదారులను తుపాకితో బెదిరించి వారినుంచి సెల్‌ఫోన్లను లాక్కుని, వారందరినీ ఓ గదిలో బంధించారు. అనంతరం కాషియర్ మంగరాజ్ జెన్నాను బెదిరించి లాకర్లను పగలగొట్టి అందులో ఉన్న సుమారు రూ.44 లక్షలు దోచుకున్నారు. అంతేకాదు అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి హార్డ్ డిస్క్‌లను కూడా తీసుకుని పరారయ్యారు.
ఖజానా గదిని తెరిచేందుకు క్యాషియర్ను బలవంతం చేసి సొమ్ముని ఎత్తుకెళ్లిపోయారని బ్రాంచ్ మేనేజర్ సంజయ్ కుమార్ ఝా చెప్పారు. అధికారుల ఫిర్యాదుమేరకు పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. నగరం నుంచి బయటకు వెళ్లే అన్ని మార్గాలను మూసివేసి సోదాలు నిర్వహిస్తున్నారు. అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టామని రూర్కెలా ఎస్పీ ఉమా శంకర్ దాస్ వెల్లడించారు. జార్ఖండ్‌కు చెందిన బ్యాంకు దోపిడీ ముఠా పనిగా భావిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు సంబంధిత అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment