హడలెత్తిస్తున్న దొంగలు | 5 special teams for muthoot of the accused | Sakshi
Sakshi News home page

హడలెత్తిస్తున్న దొంగలు

Published Fri, Feb 6 2015 12:17 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

హడలెత్తిస్తున్న దొంగలు - Sakshi

హడలెత్తిస్తున్న దొంగలు

జిల్లా పోలీసులకు సవాల్

ముత్తూట్ చోరుల కోసం తనిఖీలు చేస్తుండగానే.. మరో బ్యాంకు లూటీకి దొంగల యత్నం
మనోరాబాద్ గ్రామీణ వికాస్ బ్యాంకు దోపిడీకి విఫలయత్నం
సైరన్ మోగడంతో పరారీ
‘ముత్తూట్’ నిందితుల వేటలో 5 ప్రత్యేక బృందాలు

 
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : మన పోలీసులకు ఇపుడు తమ సత్తా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వైపు బీరంగూడ ముత్తూట్ మినీ ఫైనాన్స్‌ను లూటీ కేసులో దొంగల కోసం గాలింపు చేస్తుండగానే... ఇదేమీ లెక్కచేయకుండా మరో గ్యాంగ్  బుధవారం అర్ధరాత్రి మనోరాబాద్‌లో గ్రామీణ వికాస్ బ్యాంకును లూటీ చేసేందుకు విఫలయత్నం చేసింది. బ్యాంకు సైరన్ వైర్లు కత్తిరించే ప్రయత్నంలో పొరపాటు దొర్లి సైరన్ మోగడంతో  దొంగలు పారిపోయారు. వందల మంది పోలీసులు రోడ్ల మీద చేస్తున్న తనిఖీలు వట్టి డొల్లేనని బట్టబయలైంది.
 
హైదరాబాద్ వైపే దొంగలు...


ముత్తూట్ ఫైనాన్స్‌లో దొంగతనం జరిగి 48 గంటలు గడుస్తున్న నేపథ్యంలో దొంగలు సురక్షిత ప్రాంతానికి చేరుకొనే అవకాశం ఉంది. దోపిడీకి పాల్పడింది ఆరితేరిన నేరస్తులు కావడంతో సంఘటనా స్థలంలో పోలీసులకు చిన్న ఆధారం కూడా దొరక్కుండా జాగ్రత్త పడ్డారు. కనీసం వాళ్లు ఎలా వచ్చారో....ఎటు వైపుకు వెళ్లిపోయారో కూడా ఇప్పటి వరకు పోలీసులు గుర్తించలేకపోయారు. దొంగలు నింపాదిగా  ఫైనాన్స్‌లోకి చొరబడి వచ్చిన పనిని చక్కబెట్టుకొని కూల్‌గా వెళ్లిపోవడంతో స్థానికుల దృష్టి వారిమీద పడలేదు.

ఫైనాన్స్ కార్యాలయంలో చించిపడేసిన గుడ్డ పీలికల వాసన  పసిగట్టిన పోలీసు జాగిలం ఫైనాన్స్ కార్యాలయం నుంచి  జాతీయ రహదారి అవతలి వైపు ఉన్న సబ్‌స్టేషన్ వరకు వెళ్లింది. అక్కడి నుంచి కొద్దిగా వెనక్కి వచ్చి రోడ్డు పక్కన ఒక చెట్టు కింద ఉన్న టీస్టాల్ వరకు వచ్చి ఆగిపోయింది. ఇది బీదర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే రోడ్డు. దొంగలు ఒక వేళ టీ తాగి ఉంటే జాగిలం కచ్చితంగా తాగి పడేసిన టీ కప్పులను గుర్తించేది. ఈ లెక్కన చూస్తే దొంగల గ్యాంగ్‌లో కొంత మంది హైదరాబాద్ వైపు వెళ్లినట్లు అర్థమవుతోంది.

ఒక్కో గ్యాంగ్‌దీ ఒక్కో స్టైల్

ప్రత్యక్ష సాక్షుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ముత్తూట్ ఫైనాన్స్ లూటీలో 6 మంది సభ్యులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీరు మూడు, లేదా అంతకంటే ఎక్కువగా గ్రూపులుగా విడిపోయి తప్పించుకునే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దోచుకున్న సొత్తును పార్శిల్ బాక్స్‌ల్లో వేసి, కచ్చితమైన అడ్రస్ రాసి టాన్స్‌పోర్టులో వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత ఎవరికి వారుగా విడిపోయి బస్సు, లారీ, తదితర వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. లేదా నగరంలోనే ఏదైనా సురక్షిత ప్రాంతంలో ఉండొచ్చని భావిస్తున్నారు.

సంఘటనా స్థలంలో  ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు దొంగల‘ శైలి’ మీదనే ఆశలు పెట్టుకున్నారు. మనిషి హస్తరేఖలు ఒక్కో వ్యక్తివి ఒక్కో రకంగా  ఉన్నట్లుగానే.. ఒక్కో గ్యాంగ్ ఒక్కో స్టైల్‌లో చోరీ చేస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఈ ‘ప్రత్యేక శైలి’ మీదనే ఆశలు పెట్టుకొని కేసు దర్యాప్తు ప్రారంభించారు. ముత్తూట్ దొంగలను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.  ఒక టీం కర్ణాటక, మరో టీం మహారాష్ట్రకు బయలుదేరి వెళ్లాయి. మిగిలిన టీంలు హైదరాబాద్‌లోనే దొంగలను గాలించే పనిలో పడ్డాయి.

పాతవారే ఆధారం

భారీ దోపిడీలు జరిగినప్పుడు పోలీసులు నిందితుల ఆచూకీ కోసం పాత నేరస్తులపై ఆధారపడతారు. దొంగలు వేర్వేరు జైళ్లలో సహవాసం చేసే క్రమంలో వారివారి పనితనం గురించి చర్చించుకుంటారు. వాటిలో ఉపయుక్తమైన మెళకువలు ఒక గ్యాంగ్ నుంచి మరో గ్యాంగ్ స్వీకరిస్తుంది.  దీని ఆధారంగానే పోలీసులు ముత్తూట్ కేసులో ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. పాత నేరస్తుల వివరాలు సేకరించి వారి ద్వారా ఫైనాన్స్ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయే వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement