ఆర్ఎస్ఎస్ క్రిస్టియన్ విభాగం!
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) క్రిస్టియన్ విభాగాన్ని ప్రారంభించాలని భావిస్తోంది. ఈ మేరకు డిసెంబర్ 17న వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు క్రిస్టియన్ మత పెద్దలతో సమావేశాన్ని కూడా నిర్వహించారు. దశాబ్దం క్రితం ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగం.. రాష్ట్రీయ ఇసాయ్ మంచ్‌ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఇదే విధానంలో క్రిస్టియన్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆర్ఎస్ఎస్ యోచిస్తోంది. డిసెంబర్ 17న నిర్వహించిన సమావేశాన్ని.. క్రిస్టియన్ విభాగం ఏర్పాటుకు పునాదిగా భావించవచ్చని ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు ఇంద్రేష్ కుమార్ అన్నారు.
క్రిస్టియన్ కమ్యూనిటీతో సంత్సంబంధాలను పెంపొందించుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవలి కాలంలో దేశంలో మత అసహనం పెరిగిపోతుందంటూ చెలరేగుతున్న దుమారానికి కూడా ఇది కొంత స్వాంతన కలిగించే చర్యగా ఆర్ఎస్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నారు.