పేటీఎం యాప్ వాట్సాప్‌కు షాకిస్తుందా?
ముంబై: పాపులర్ మెసేజింగ్ యాప్‌ను దెబ్బకొట్టేందుకు ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎ సిద్ధపడుతోంది. త్వరలోనే వాట్సాప్‌కు పోటీగా ఓ మెసేజింగ్ యాప్‌ను లాంచ్ చేయనుంది.
సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సొంతమైన వాట్సాప్ పోటీ గా పేటీఎం వ్యూహాన్ని రచిస్తోందని పేటీఎం సన్నిహిత వర్గాల సమాచారం. సాఫ్ట్ బ్యాంక్, అలీబాబా మద్దతునందిస్తున్న ఈ ప్రముఖ డిజిటల్ చెల్లింపు సంస్థ ఈ నెల చివరినాటికి ఈ యాప్‌ను లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఆహారం నుంచి..విమాన టికెట్ల దాకా ప్రతీదాన్ని కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్న పేటీఎం దేశ ప్రజలను ఆకర్షించేవిధింగా దీన్ని రూపొందించిందట. ముఖ్యంగా ఈ యాప్ ద్వారా సందేశాలు, ఫోటోలు,ఆడియో, వీడియోలు షేర్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనుందని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఈ వార్తలపై అటు పేటీఎం, ఇటు వాట్సాప్ స్పందించాల్సి ఉంది.
కాగా పేటీఎం ప్రస్తుతం 22. 5 కోట్లకు (225 మిలియన్లు) పైగా వినియోగదారులను కలిగి ఉంది. మరోవైపు అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతున్న వాట్సాప్ రోజువారీ వినియోగదారుల సంఖ్య ఇటీవల వందకోట్లను దాటేసింది. మరి రానున్న పేటీఎం యాప్ స్థిరమైన వృద్ధితో సాగుతున్న వాట్సాప్‌కు ధీటుగా , పోటీగా నిలబడుతుందా? వేచి చూడాలి.