కలెక్టర్ ఆఫీసు ముందే చితకబాదారు
అహ్మదాబాద్: అక్రమ మైనింగ్ ఆగడాలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ఓ సమాచార హక్కు కార్యకర్తపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి చావగొట్టారు. గుజరాత్ లోని తాపి జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ.. దీనికి సంబంధించిన సమాచారం కోసం ఆర్టీఐకి దరఖాస్తు చేసుకోవడంతో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు తనపై దాడి చేశారని సమాచార హక్కు కార్యకర్త రోమెల్ సుథారియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు డజను మంది తనపై దాడి చేసి.. తన వద్ద ఉన్న పత్రాలను లాక్కెళ్లారని, ఇందులో అక్రమ మైనింగ్‌కు సంబంధించిన ఆర్టీఐ పత్రాలు కూడా ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు.
అక్రమ మైనింగ్ వ్యవహారంపై గవర్నర్ విచారణకు హాజరయ్యేందుకు తాను కలెక్టర్ కార్యాలయానికి వెళుతుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ ఘటన ఐపీసీ సెక్షన్లు 143 (అక్రమంగా గుమిగూడటం), 323 (ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం) కింద కేసు నమోదు చేశామని, దాడికి పాల్పడిన దుండగులను ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. తాపి జిల్లాలో అక్రమంగా సాగుతున్న మైనింగ్, ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా రోమెల్ సుతారియా పోరాడుతున్నారు. జిల్లాలో 62 అక్రమ మైనింగ్, ఇసుక క్వారీలున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా జిల్లా మైనింగ్ శాఖ అధికారులు వీటికి అనుమతులు ఇచ్చారని ఆయన తెలిపారు.