మోడీ ప్రమాణస్వీకారానికి సార్క్ దేశాధినేతలు
తన పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని నరేంద్ర మోడీ పంపిన ఆహ్వానానికి ఆయా దేశాలు పాజిటివ్ గా స్పందిస్తున్నాయి. ఇప్పటికే అఫ్గనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, మారిషస్ తరఫున ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులామ్, శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్షేలు తాము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు ప్రకటించారు. మాల్దీవ్స్ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ అబ్దుల్ గయ్యూమ్ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. మరో వైపు నేపాల్ ప్రధాని, భూటాన్ కొత్త ప్రధాని కూడా రానున్నారు.
బంగ్లాదేశ్ ప్రభుత్వం తరఫున పార్లమెంటు స్పీకర్ రానున్నారు. అయితే పాకిస్తాన్ మాత్రం ఇప్పటి వరకూ భారత ప్రభుత్వం ఆహ్వానంపై ఎటూ తేల్చుకోలేకపోతోంది.
మోడీ సార్క్ దేశాలను ఆహ్వానించడం ఒక కొత్త ఒరవడిని మొదలుపెట్టినట్టయింది. బంగ్లాదేశ్ తో తీస్తా నది జలాల పంపకం, పాకిస్తాన్ తో ఉగ్రవాదం, ఇతర సమస్యల పరిష్కారం వేగవంతం చేసే దిశగా మోడీ చర్యలు తీసుకుంటారన్న నమ్మకం కలుగుతోందని సార్క్ దేశాల విశ్లేషకులు అంటున్నారు.