
శబరిమల : కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నాంబళంమేడు కొండల్లో బుధవారం సాయంత్రం మకర జ్యోతి దర్శనమిచ్చింది. భారీ సంఖ్యలో ఇప్పటికే జ్యోతి దర్శనం కోసం శబరిమలకు చేరుకున్న భక్తులు జ్యోతిని చూసి ఆనంద పరవశులయ్యారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ శబరిమల సన్నిధానం మారుమోగింది. మకరజ్యోతి దర్శనానికి విచ్చేసిన అయ్యప్ప స్వాములతో పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. పంబ, నీలికల్, పులిమేడ్ ప్రాంతాలను జ్యోతిని వీక్షించేందుకు ట్రావెన్స్‌కోర్ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. మరోవైపు పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు.
అంతకుముందు మకరజ్యోతి వీక్షించేందుకు వచ్చిన అయ్యప్ప స్వాములతో శబరిమల సన్నిధానం కిక్కిరిసిపోయింది. మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమల సన్నిధానం నుంచి పంబ వరకు బారులు తీరారు. కేరళతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు తరలివెళ్లారు. స్వామి కోసం పందళ రాజ వంశీకులు తీసుకువచ్చిన ప్రత్యేక ఆభరణాలను అయ్యప్ప స్వామికి అలంకరించారు. ఆ తర్వాత సాయంత్రం 6.50 గంటల సమయంలో పొన్నాంబలమేడు కొండపై జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చింది.