సల్మాన్‌కు బెయిల్‌ | Salman Khan granted bail while appealing poaching sentence | Sakshi
Sakshi News home page

సల్మాన్‌కు బెయిల్‌

Published Sun, Apr 8 2018 2:10 AM | Last Updated on Sun, Apr 8 2018 7:50 AM

Salman Khan granted bail while appealing poaching sentence - Sakshi

శనివారం ముంబైలోని తన నివాసంలో అభిమానులతో మాట్లాడుతూ సల్మాన్‌ హావభావాలు

జోధ్‌పూర్‌: బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌కు ఊరట లభించింది. కృష్ణ జింకల్ని చంపిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్న సల్మాన్‌కు జోధ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టు శనివారం బెయిల్‌ మంజూరు చేసింది. గురువారం ట్రయల్‌ కోర్టు దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించడంతో రెండ్రోజులు జోధ్‌పూర్‌ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించిన కండల వీరుడు బెయిల్‌పై విడుదల కాగానే నేరుగా ముంబైకి ప్రత్యేక విమానంలో వెళ్లిపోయారు. అయితే బెయిల్‌ మంజూరును రాజస్తాన్‌ హైకోర్టులో సవాలు చేస్తామని బిష్ణోయ్‌ తెగ ప్రతినిధి రామ్‌ నివాస్‌ తెలిపారు. 

సల్మాన్‌ పెట్టుకున్న బెయిల్‌ దరఖాస్తుపై శుక్రవారమే వాదనలు పూర్తి కాగా తీర్పును సెషన్స్‌ కోర్టు జడ్జి శనివారానికి వాయిదావేశారు. ఉదయం బెయిల్‌ పిటిషన్‌పై డిఫెన్స్, ప్రాసిక్యూషన్‌ న్యాయవాదులు మరోసారి వాదనలు వినిపించారు. తీర్పును న్యాయమూర్తి మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం 3 గంటల సమయంలో జడ్జి తీర్పు వెలువరిస్తూ.. బెయిల్‌ కోసం రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తు, అదే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని డిఫెన్స్‌ న్యాయవాదుల్ని ఆదేశించారు.

బెయిల్‌ పిటిషన్‌ విచారణ సమయంలో సల్మాన్‌ చెల్లెళ్లు అల్విరా, అర్పితలు కోర్టులోనే ఉన్నారు. కోర్టు నుంచి బెయిల్‌ పత్రాలు అందగానే జైలు అధికారులు సాయంత్రం 5.30 గంటల సమయంలో సల్మాన్‌ను విడుదల చేశారని.. అనంతరం పోలీసు పహారా మధ్య వ్యక్తిగత బాడీగార్డు షేరా వెంటరాగా జోధ్‌పూర్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లారని పోలీసు అధికారి చెప్పారు. కొంతమంది అభిమానులు ఆయన కాన్వాయ్‌ వెంట పరుగులు తీశారు. 

ట్రయల్‌ కోర్టు తీర్పును నిలుపుదల చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను మే 7న విచారిస్తామని, అప్పుడు సల్మాన్‌ కోర్టుకు హాజరుకావాలని జడ్జి రవీంద్ర కుమార్‌ జోషి ఆదేశించారు. కాగా ఆయనను సిరోహి కోర్టుకు బదిలీ చేస్తూ శనివారం సాయంత్రం రాజస్తాన్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ నుంచి ఉత్తర్వులు అందాయి. సాధారణ బదిలీల్లో భాగంగా మొత్తం 134 జడ్జీల్ని ట్రాన్స్‌ఫర్‌ చేయగా అందులో రవీంద్ర కుమార్‌ జోషి కూడా ఉన్నారు. 1998 అక్టోబర్‌లో ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ ’హై సినిమా షూటింగ్‌ సమయంలో రెండు కృష్ణ జింకల్ని చంపిన నేరంపై గురువారం ట్రయల్‌ కోర్టు సల్మాన్‌ను దోషిగా నిర్ధారించి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

బెయిల్‌పై బాలీవుడ్‌లో హర్షం
బెయిల్‌ మంజూరైన విషయం తెలియగానే సల్మాన్‌ స్నేహితులు, సన్నిహితులు, బాలీవుడ్‌ వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. సల్మాన్‌ నటిస్తున్న ‘రేస్‌ 3’ చిత్ర దర్శకుడు రెమో డిసౌజా మాట్లాడుతూ.. ‘సల్మాన్‌కు బెయిల్‌ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. నటుడుగా, మానవత్వమున్న వ్యక్తిగా సల్మాన్‌ను అభిమానిస్తా’ అని చెప్పారు. ఆ చిత్ర నిర్మాత రమేష్‌ తౌరానీ మాట్లాడుతూ.. ‘సల్మాన్‌ విడుదల కావడం మాకు చాలా ముఖ్యం. మా ప్రార్థనలకు సమాధానం లభించింది. రేస్‌ 3 సినిమా నిర్మాణం  దాదాపుగా పూర్తయింది’ అని చెప్పారు. హీరోయిన్‌ సోనాక్షి సిన్హా, నటులు సోనూ సూద్, నీల్‌ నితిన్‌ ముకేశ్, దర్శకుడు అనీస్‌ బజ్మీ తదితరులు సల్మాన్‌కు బెయిల్‌ రావడాన్ని స్వాగతించారు.   


                         సల్మాన్‌ విడుదలతో అహ్మదాబాద్‌లో సంబరాలు చేసుకుంటున్న విద్యార్థినులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement