వివాదంలో సల్మాన్‌ఖాన్
- షూటింగ్ తర్వాత నా పరిస్థితి రేప్‌కు గురైన మహిళలా ఉండేది: సల్మాన్
- సల్మాన్ వివాదాస్పద వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచీ విమర్శలు
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్ తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాడు. సల్మాన్ నటించిన తాజా చిత్రం ‘సుల్తాన్’ త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సుల్తాన్ సినిమా షూటింగ్ తర్వాత తన పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళ మాదిరిగా ఉండేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో దుమారం రేగింది. సల్మాన్ క్షమాపణలు చెప్పాలని అన్ని వైపులను నుంచి డిమాండ్లు వస్తున్నాయి. రెజ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమా కోసం మల్లయుద్ధంలో తీవ్ర శిక్షణ తీసుకున్నాడు సల్మాన్. జూలై 6న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవలవిలేకరులకు సల్మాన్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఒక సన్నివేశం షూటింగ్ పూర్తయిన తర్వాత తన పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ.. ‘ఆరు గంటల పాటు షూటింగ్ జరిగేది. ప్రత్యర్థిని ఎత్తి కిందపడేయాల్సి వచ్చేది. 120 కిలోల బరువున్న వ్యక్తిని పది సార్లు.. పది వేర్వేరు భంగిమల్లో ఎత్తాల్సి వచ్చేది. ఆ తర్వాత వారిని చాలాసార్లు కింద పడేయాల్సి వచ్చేది. నిజమైన పోరాటాల్లో ఇన్నిసార్లు చేయాల్సిన అవసరం లేదు. కానీ సినిమా కోసం ఒకేపనిని పదిసార్లు చేయాల్సి వచ్చేది. షూటింగ్ పూర్తైరింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నడవడం కూడా కష్టంగా ఉండేది. అప్పుడు నా పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళ మాదిరిగా ఉండేది’ అన్నారు.
అయితే తన వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన సల్మాన్.. తాను ఇలా పోల్చి ఉండాల్సింది కాదని వెంటనే వివరణ ఇచ్చుకున్నాడు. సల్మాన్ వ్యాఖ్యలను సుమోటో కేసుగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని లేఖ రాసింది. ఏడు రోజుల్లో సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోతే కమిషన్ ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎన్‌సీడబ్ల్యూ చీఫ్ లలితా కుమారమంగళం సల్మాన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముంబై బాంద్రాలోని సల్మాన్ నివాసం ఎదుట పలువురు మహిళా కార్యకర్తలు నిరసనకు దిగారు. సల్మాన్ ఖాన్ తండ్రి, సినీ రచయిత సలీంఖాన్ కుమారుని తరఫున క్షమాపణలు చెప్పారు.