సుల్తాన్ రికార్డులను కబాలి దాటేస్తుందా?
సల్మాన్ ఖాన్ లేటు వయసులో మల్లయోధుడిగా నటించిన సుల్తాన్ సినిమా బాక్సాఫీసును కొల్లగొట్టింది. దాన్ని తలదన్నే కలెక్షన్లు సాధించే సత్తా ఇంకేదైనా సినిమాకు ఉందా.. అంటే కచ్చితంగా ఉందని, అది కబాలి అని సినీ పండితులు అంటున్నారు. ముఖ్యంగా కబాలి సినిమా మొదటి మూడు రోజుల్లోనే రూ. 200 కోట్ల కలెక్షన్లు సాధించడం ఖాయమని ఈ సినిమా నిర్మాత కలైపులి ఎస్ థాను విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. కబాలి సినిమా ప్రపంచవ్యాప్తంగా 12వేల స్క్రీన్లలో విడుదల అవుతోందట. సుల్తాన్ అయితే కేవలం 6000 స్క్రీన్లలోనే విడుదలైంది. అలాగే సుల్తాన్ టీజర్ కంటే కబాలి టీజర్కు యూట్యూబ్లో ఎక్కువ హిట్లు వచ్చాయి. ఇప్పటికే 2.5 కోట్లను దాటిన ఈ హిట్లు ఇంకా రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.
ముంబైలో ఏ థియేటర్కైనా వెళ్లి సుల్తాన్ సినిమా టికెట్ కొనాలంటే రూ. 1500 అవుతుందని, అలాగే బెంగళూరులో కబాలి సినిమా టికెట్ కూడా రూ. 1500 చొప్పున ఉంటోందని, అదే తమిళనాడులో మాత్రం రూ. 120కి, 80కి.. ఇంకా మాట్లాడితే 50 రూపాయలకు కూడా కబాలి టికెట్ దొరుకుతుందని నిర్మాత కలైపులి థాను అన్నారు. అయినా ఈ కొద్దిమొత్తం టికెట్లతోనే తాము 200 కోట్లు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సుల్తాన్ సినిమాకు పది రెట్ల కలెక్షన్లు వస్తాయని అన్నారు.