మోదీ భుజం తట్టారు.. సీఎం హత్తుకున్నారు
గువాహటి: ఎట్టకేలకు ఈశాన్య రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగిరింది. అసోం ముఖ్యమంత్రిగా సర్వానంద సోనోవాల్ మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. గువాహటిలోని ఖానపరా వెటర్నరీ కాలేజీలో ఈ కార్యక్రమం జరిగింది. అసోం గణపరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) సహకారంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ మొత్తం 126 సీట్లలో 86 సీట్లను గెలుచుకుని విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 15 ఏళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత తొలిసారి ఇక్కడ బీజేపీ పరిపాలన బాధ్యతలు చేపట్టింది.
ఈ ప్రమాణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, ఇతర ముఖ్య కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్బంగా 11మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ నుంచి 2015లో బీజేపీలో చేరి పార్టీ విజయానికి కీలకంగా పనిచేసిన హిమంత్ బిస్వా శర్మ కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా బిస్వాల్కు ప్రధాని మోదీ కరచాలనం ఇచ్చి భుజం తట్టగా.. ముఖ్యమంత్రి సోనోవాల్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కాంగ్రెస్ నేత మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.