సాక్షి ప్రతినిధి, చెన్నై: భర్త నటరాజన్‌ను చూసిన సమయంలో శశికళ కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిసింది. భర్త దగ్గరుండి పర్యవేక్షించుకునే పరిస్థితిలేనందున మీరే కాపాడాలని వైద్యులను శశికళ వేడుకున్నారు. చెన్నై గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్‌ను పరామర్శించేందుకు అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళకు ఐదు రోజుల పెరోల్ లభించింది. బెంగళూరు జైలు నుంచి శుక్రవారం రాత్రి ఆమె చెన్నైకి చేరుకున్నారు. సుదీర్ఘ విరామం తరువాత భర్తను కలవనుండడంతో కొందరు పెద్దల సూచన మేరకు శనివారం ఉదయం 9–10.30 గంటల రాహుకాలం ముగిసిన తరువాత 11 గంటలకు ఇంటి నుంచి బయలుదేరారు. జయలలిత సెంటిమెంట్ ఆలయమైన కొట్టూరుపురంలోని వినాయకుని గుడి వద్ద కారులో నుంచే దణ్ణం పెట్టుకున్నారు. 11.50 గంటలకు గ్లోబల్ ఆస్పత్రికి చేరుకున్నారు. బందోబస్తులో ఉన్న పోలీసులు ఆమెను అనుసరించారు. పరిమిత సంఖ్యలో బంధువులు ఆమె వెంటవచ్చినా ఐసీయూలో ఉన్న నటరాజన్ వద్దకు శశికళను మాత్రమే వైద్యులు అనుమతించారు.
ఉద్వేగానికి గురైన శశికళ
శశికళ కొద్దిసేపు ఆస్పత్రి ఐసీయూలో గడిపిన తరువాత విజిటర్స్ గ్యాలరీలో ఉండిపోయారు. బంధువులు, వైద్యులతో ఆమె మాట్లాడారు. నటరాజన్‌ను చూసిన సమయంలో ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. భర్త ఆరోగ్యంపై తీవ్ర ఆవేదన చెందుతున్న శశికళకు వైద్యులు ధైర్యం చెప్పారు. ఇటీవల నిర్వహించిన కాలేయం, మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స సఫలీకృతమైందని, ఈ రెండు బాగా పనిచేస్తున్నాయని తెలిపారు. మరో పదిరోజుల్లో ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలిస్తామని చెప్పారు. ఆ తరువాత డిశ్చార్జయి మూడు నెలలపాటూ ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటే ఆ తరువాత సాధారణ జీవితంలోకి అడుగుపెట్టవచ్చని శశికళకు వైద్యులు వివరించారు. భర్త ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించుకునే పరిస్థితి లేనందున మీరే కాపాడాలని వైద్యులను శశికళ వేడుకున్నారు. ఇదిలా ఉండగా, నటరాజన్ కొన్నాళ్లపాటూ ప్రమాదకరమైన పరిస్థితిలోనే ఉంటారని, నెమ్మదిగా కోలుకునే అవకాశం ఉందని పేర్కొంటూ గ్లోబల్ ఆస్పత్రి శనివారం ఒక బులెటిన్‌ను విడుదల చేసింది. నటరాజన్‌కు శుక్రవారం ట్రాక్యోస్టమీ శస్త్రచికిత్స చేశారు.
నిఘా నీడ.. నిబంధనలతో నిరాశ
పెరోల్ మంజూరులో తమిళనాడు, కర్ణాటక పోలీసులు పెట్టిన నిబంధనలతో శశికళ బసచేసిన నివాసంపై తీవ్రస్థాయిలో నిఘా అమలుచేస్తున్నారు. వీరుగాక కొందరు పోలీసులు మఫ్టీలో నిలబడి శశికళ ఇంటికి ఎవరెవరు వచ్చిపోతున్నారో గమనిస్తున్నారు. జైలుకు వెళ్లకముందు అన్నాడీఎంకేలో హైడ్రామా నడిపి ఎడపాడిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. తన విశ్వాసపాత్రులకు మంత్రి పదవులు ఇప్పించారు. గడిచిన ఎన్నికల్లో పోటీచేసేందుకు పెద్ద సంఖ్యలో సీట్లు ఇప్పించగా వారంతా ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. వారిలో కొందరైనా పెరోల్‌పై వచ్చిన తనను కలుసుకునేందుకు వస్తారని శశికళ విశ్వసించారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు బంధువులతో మాట్లాడిన శశికళ పార్టీ నేతలు, ఇతర వీఐపీలతో మాట్లాడేందుకు శనివారం తెల్లవారుజామునే లేచి సిద్ధంగా కూర్చున్నారు. అయితే పెరోల్ నిబంధనలకు భయపడి ఎవరూ ఆమె కోసం రాలేదు. కేంద్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర పోలీసుల కంటపడితే ఎటువంటి చిక్కులు వచ్చిపడతాయోనని దినకరన్ వర్గానికి చెందిన అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలు సైతం సాహసించలేదు. ఎంపీ నవనీతకృష్ణన్, పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి తదితరులు శశికళ వచ్చే సమయానికి గ్లోబల్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నా లోపలకు వెళ్లలేక గేటు వద్దనే నిలబడిపోయారు. పెరోల్ మంజూరులో విధించిన నిబంధనలపై టీటీవీ దినకరన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెరోల్ ఐదు రోజులను హౌస్ అరెస్ట్‌గా మార్చేశారని విమర్శించారు.
జయ కారులో జల్సా
బెంగళూరు జైలు నుంచి పెరోల్‌పై బయటకు వచ్చినప్పటి నుంచి దివంగత జయలలిత కారునే శశికళ వినియోగిస్తున్నారు. సచివాలయానికి, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు జయలలిత ఇదే కారు (నంబరు టీఎన్ 09–6167) ను వినియోగించేవారు. జయ కాలంనాటి డ్రైవరునే పెట్టారు. జయలలిత వినియోగించే కార్లన్నీ ప్రస్తుతం ఇళవరసి ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. శశికళ బసచేసిన సాధారణ కుటుంబాల ఇళ్ల మధ్య జయ కారు తిరుగాడడంతో ప్రజలు వింతగా చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment