
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య కేసులో ఇప్పట్లో తేలేలా లేదు. దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ కేసులో తుది తీర్పు ఆలస్యం కానుంది. అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదాస్పద ప్రాంతంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కేఎం జోషిల ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఆదేశాలు వెలువరించింది.
జనవరిలో విచారణ తేదీలను సర్వోన్నత న్యాయస్థానం ఖరారు చేయనుందని న్యాయవాదులు తెలిపారు. రోజువారీ విచారణ తేదీలపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశముందన్నారు. వివాదాస్పద రామజన్మభూమి–బాబ్రీ మసీదు ప్రాంతంలోని 2.77 ఎకరాల భూమిని సమంగా విభజించి సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖారా, రామ్ లల్లా సంస్థలకు కేటాయించాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment