
సాక్షి,న్యూఢిల్లీ: తమను తిరిగి మయన్మార్ పంపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రోహింగ్యా ముస్లింలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఈనెల 13న విచారించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ అంశం మానవీయ కోణానికి సంబంధించినది కావడంతో తాము కేవలం చట్ట నిబంధనలకే వాదనలు అనుమతిస్తామని, ఇరు పార్టీలు భావోద్వేగాల ఆధారంగా వాదనలకు దిగరాదని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టంచేసింది. ఈ అంశాన్ని పరస్పర గౌరవంతో విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
కోర్టుకు సహకరించేందుకు ఇరు పార్టీలు సంబంధిత పత్రాలు, అంతర్జాతీయ సమావేశాల వివరాలను తమకు అందించాలని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన సుప్రీం బెంచ్ కోరింది. అంతకుముందు పిటిషనర్ రోహింగ్యా శరణార్ధుల తరపున సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ వైఖరితో విభేదించారు. వ్యక్తి హక్కులకు ఆర్టికల్ 32 కింద రాజ్యాంగం భద్రత కల్పిస్తున్న క్రమంలో ఈ పిటిషన్ విచారణార్హమైనదని పేర్కొన్నారు. అయితే ఈ అంశంలో భిన్నపార్శ్వాలున్న క్రమంలో దీనిపై సమగ్ర విచారణ అవసరమని, వేర్వేరుగా విచారించడాన్ని ప్రభుత్వం సమ్మతించదని అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు.