న్యూఢిల్లీ: రోహింగ్యా శరణార్థుల సమస్య అత్యంత విస్తృతమైనదని, లోతైనదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి సున్నితమైన సమస్యల పరిష్కారంలో జాతి ప్రయోజనాలు, మానవ హక్కులను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించటంలో కేంద్రం పాత్ర చాలా కీలకమని అభిప్రాయపడింది. జాతి భద్రత, ఆర్థిక అంశాలు, మానవత్వం వంటి కీలకాంశాలు ముడిపడిఉన్న ఈ కేసులో జాతి ప్రయోజనాలు, మానవ హక్కుల మధ్య సమతుల్యత ఉండాల్సిన అవసరముందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం పేర్కొంది.
రోహింగ్యాలను వెంటనే పంపించే నిర్ణయం తీసుకోకూడదని కేంద్రానికి సూచించింది. కోర్టు లిఖితపూర్వకమైన ఆదేశాలు ఇస్తే దీని ప్రభావం అంతర్జాతీయంగా ప్రభావం చూపే అవకాశం ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. రోహింగ్యా ముస్లింలను మయన్మార్‌కు తిరిగి పంపించి వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై నవంబర్ 21 నుంచి సమగ్ర విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు.. ఈ మధ్యలో ఏమైనా అనిశ్చిత పరిస్థితులు తలెత్తాయనిపిస్తే పిటిషనర్లు కోర్టును ఆశ్రయించవచ్చంది. ‘అంతర్జాతీయంగా ఈ సమస్య ప్రభావం చూపుతోంది. ఈ విషయంలో మన పాత్రను తెలుసుకోవాలి’ అని‡ మెహతా తెలిపారు.
తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలి
‘అందరు రోహింగ్యాలు (ముస్లింలు అయినా.. హిందువులైనా) ఉగ్రవాదులు కాదు. అలాంటప్పుడు వారిపై కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తగదు’ అని పిటిషనర్ల తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ ఫాలీ ఎస్ నారీమన్ కోర్టుకు తెలిపారు. అయితే, మానవహక్కులను కాపాడే విషయంలో ఏమాత్రం సందేహం లేదని.. కానీ దేశ భద్రత, జాతి ప్రయోజనాల అంశాలనూ దృష్టిలో ఉంచుకోవాలని కోర్టు సూచించింది. ‘చిన్నారులు, మహిళలకు ఏమీ తెలియదు. రాజ్యాంగ బద్ధ సంస్థగా దీన్ని మేం విస్మరించలేం. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని మరిచిపోదని అనుకుంటున్నాం. వారిని పంపించేయొద్దు. ఏమైనా తప్పు (జాతి భద్రతకు సంబంధించి) జరిగినట్లు తెలిస్తే చర్యలు తీసుకోండి’ అని ప్రభుత్వానికి ధర్మాసనం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment