సాక్షి, తిరువనంతపురం : ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సుప్రీం కొలిజియం చేసిన సిఫార్సును కేంద్రం తోసిపుచ్చిన క్రమంలో నెలకొన్న వివాదం కొనసాగుతోంది. సర్వోన్నత న్యాయస్థానం కొలిజియం చేసిన సిఫార్సును కేంద్రం తిరస్కరించడం తగదని సుప్రీం కోర్టు కొలీజియం సభ్యుడు జస్టిస్ కురియన్ జోసెఫ్ అన్నారు. కేంద్రం నిర్ణయంపై తీవ్ర చర్చ జరుగుతోందని, ఇలాంటి ఉదంతం గతంలో ఎన్నడూ చోటుచేసుకోలేదన్నారు. కేఎం జోసెఫ్‌ను సుప్రీం న్యాయమూర్తిగా నియమించాలని కేంద్రానికి సిఫార్సు చేసిన కొలిజియంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గగోయ్, మదన్ బీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు సభ్యులుగా ఉన్నారు.
మరోవైపు కేఎం జోసెఫ్ అంశంపై నిర్ణయాన్ని సుప్రీం కోర్టు పెండింగ్‌లో ఉంచాలని నిర్ణయించిన క్రమంలో కురియన్ జోసెఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, జోసెఫ్ నియామకం వాయిదా పడిన క్రమంలో కోల్‌కతా, రాజస్థాన్, తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను కూడా సుప్రీం న్యాయమూర్తుల నియామకానికి కొలిజియం పరిశీలిస్తోంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఇందూ మల్హోత్రా పేరును ఆమోదించిన కేంద్రం జోసెఫ్ ఫైల్‌ను పునఃపరిశీలించాలని కొలిజియంకు తిప్పిపంపిన విషయం తెలిసిందే. ఆయన నియమాకాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నదీ వివరిస్తూ ఆరు పేజీల వివరణాత్మక నోట్‌ను కూడా కేంద్రం పంపింది.
Comments
Please login to add a commentAdd a comment