పత్రిబల్ ఎన్‌కౌంటర్‌లో ఆర్మీకి నోటీసులు
Published Sat, Aug 19 2017 11:32 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన పత్రిబల్ ఎన్‌కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. బూటకపు ఎన్‌కౌంటర్ ఆరోపణల నేపథ్యంలో సైన్యానికి నోటీసులు జారీ చేసింది.
ఎన్‌కౌంటర్ లో ఆర్మీ అధికారుల హస్తం లేదంటూ సైన్యం ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ బాధిత కుటుంబాలు ఓ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ‘డీఎన్‌ఏ పరీక్షల్లో సైన్యం చంపింది కశ్మీర్ ప్రజలనే అని తేలింది. సీబీఐ దర్యాప్తు కూడా నిజమేనని ధృవీకరించింది. హైదరాబాద్, కోల్‌కతాలోని ఫోరెనిక్స్ ల్యాబ్ ల నివేదికలు కూడా మాత్రం చనిపోయిన వాళ్లు బాధిత కుటుంబ సభ్యులేనని నిర్థారించాయి. అలాంటప్పుడు ఇవి ముమ్మాటికీ సైన్యం చేసిన హత్యలే’అని పిటిషన్ లో బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
పిటిషనర్ వాదనతో ఏకీ భవించిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, సీబీఐ మరియు సైన్యానికి ఆరువారాల గడువు విధిస్తూ నోటీసులు జారీచేసింది.
ఎన్‌కౌంటర్.. ఏం జరిగిందంటే...
2000 సంవత్సరం మార్చిలో అనంతనాగ్ జిల్లాలో అయిదుగురు పౌరులను సైన్యం కాల్చిచంపింది. వీరంతా సరిహద్దులకు ఆవలినుంచి చొరబడి వచ్చిన లష్కరే తొయిబా ఉగ్రవాదులని ప్రకటించింది. అంతకు కొన్ని రోజుల క్రితం కశ్మీర్‌లోని చిట్టిసింగ్‌పురా అనేచోట కూలీలుగా పనిచేస్తున్న 36 మంది సిక్కులను హతమార్చిన ఉగ్రవాదులు ఈ అయిదుగురేనని తెలిపింది.
అయితే బాధిత కుటుంబాలు మాత్రం సైన్యం బూటకపు ఎన్‌కౌంటర్ చేసిందని ఆరోపించాయి. మానవహక్కుల సంఘం జోక్యం చేసుకోవటంతో చివరకు సీబీఐ చేతికి కేంద్రం దర్యాప్తును అప్పగించింది. మరోవైపు డీఎన్‌ఏ పరీక్షల్లో ఎన్‌కౌంటర్ మృతులంతా కశ్మీర్‌వాసులేనని తేలింది. సీబీఐ దర్యాప్తు నివేదిక సైతం సైన్యాన్ని తప్పుబట్టింది. ఒక బ్రిగేడియర్, ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఇద్దరు మేజర్‌లు, ఒక సుబేదారు ఈ నేరంలో భాగస్వాములని నిర్ధారించింది. కింది కోర్టులో సీబీఐ చార్జిషీటు దాఖలుచేసినప్పుడు సాయుధ దళాల (ప్రత్యేకాధికారాల) చట్టం ప్రకారం తమను విచారించడానికి ముందస్తు అనుమతులు తీసుకోవాలని చార్జిషీటులోని సైనికాధికారులు అభ్యంతరం లేవనెత్తారు. దీంతో బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
Advertisement