
మరాద్ భవన సముదాయం
సాక్షి, న్యూఢిల్లీ: కేరళ కొచ్చిన్ శివార్లలోని మరాదు ఫ్లాట్ల వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేయనున్న ఎర్నాకుళం మరాదు ప్రాంతంలోని నాలుగు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ల ఫ్లాట్ యజమానులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని భారత అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. ఈ మధ్యంతర పరిహారాన్ని నాలుగు వారాల్లోగా పంపిణీ చేయాలని కేరళ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది, ఈ మొత్తాన్ని నాలుగు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ల బిల్డర్లు, ప్రమోటర్లు చెల్లిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది. నష్టపరిహార ప్రక్రియను అంచనా వేయడానికి , కూల్చివేత ప్రక్రియను పర్యవేక్షించడానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ రవీంద్ర భట్లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలను ఉల్లంఘించినందుకు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఈ నెల ప్రారంభంలో ఆదేశించిన సంగతి తెలిసిందే.
మున్సిపాలిటీలో నిర్మించిన అత్యంత విలాసవంతమైన 400 ఫ్లాట్లను కూల్చివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ భవనాలను ఎప్పుడు పడగొట్టవచ్చో తెలుపుతూ కేరళ ప్రభుత్వం శుక్రవారం తాజా అఫిడవిట్ సమర్పించిన తరువాత సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కూల్చివేత ప్రక్రియ అక్టోబర్ 9 నుంచి ప్రారంభమై 90 రోజుల్లో పూర్తి చేస్తామని కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ ప్రదేశం నుండి శిధిలాలను తొలగించడానికి అదనంగా 48 రోజులు అవసరమని తెలిపింది. మరాదు మునిసిపాలిటీ కోరినట్లు గురువారం కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు (కెఎస్‌ఇబి), కేరళ వాటర్ అథారిటీ (కేడబ్ల్యుఎ) నాలుగు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశాయని సీనియర్ కౌన్సెల్ హరీష్ సాల్వే తెలిపారు. నిర్దేశిత సమయంలో కూల్చివేత పూర్తి చేయాలని సుప్రీం స్పష‍్టమైన ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను అక్టోబరు 25కి వాయిదా వేసింది.
కాగా జైన్స్ కోరల్ కోవ్, గోల్డెన్ కయలోరం, హెచ్ 20 హోలీ ఫెయిత్, ఆల్ఫా సెరీన్ సంస్థలే అనే నాలుగు అపార్ట్‌మెంట్ కాంప్లెక్సులు 2005కి ముందు ఇక్కడ భవన సముదాయ నిర్మాణ అనుమతి పొందాయి. మరాదు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఈ అనుమతి లభించింది. అయితే నవంబర్ 2010 లో మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయబడింది. దీంతో వివాదం నెలకొంది. ప్రతి అపార్ట్‌మెంట్ ధర రూ .50 లక్షల నుంచి రూ .1.5 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఈ వ్యవహారంలో నలుగురు బిల‍్డర్ల మీద కేసులు నమోదయ్యాయి.
విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేతతో బిల్డర్లు ఏర్పాటు చేసిన జనరేటర్
జైన్స్ కోరల్ కోవ్ కాంప్లక్స్‌లో 122 అపార్ట్‌మెంట్లు ఉండగా, జైన్ హౌసింగ్ అండ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ప్రతి ఫ్లాట్‌ను రూ .86 లక్షలకు విక్రయిస్తోంది. కెపి వర్కీ అండ్‌వీఎస్ బిల్డర్స్ నిర్మించిన గోల్డెన్ కయలోరం ఫ్లాట్ ధర 50-60 లక్షల మధ్య ఉంటుంది. హోలీ ఫెయిత్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హెచ్ 2 ఓ హోలీ ఫెయిత్ ఫ్లాట్ 1.25 - 1.5 కోట్ల రూపాయలకు విక్రయిస్తోంది. ఆల్ఫా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆల్ఫా సెరెన్ ఫ్లాట్ ధర 1.07 కోట్ల నుండి 1.33 కోట్ల మధ్య ఉంటుంది.
ఆత్మహత్యే శరణ్యం
మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై ఫ్లాట్ యజమానులు అభ‍్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాల తప్పునకు తమకు శిక్ష విధించడం సరికాదని వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఇళ్లను ఖాళీ చేసేది లేదని ప్రాన్సిస్ అనే ఫ్లాట్ ఓనర్ స్పష్టం చేశారు. ఆత్మహత్యలు చేసుకోవడమే మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టర్ సుహాస్, హరీష్ సాల్వే పర్యటన సందర్భంగా అపార్ట్‌మెంట్ వాసుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment