
బ్రదర్స్‌తో చిక్కులు
- ఆస్తుల జప్తునకు కసరత్తు
- డీవీఏసీ సన్నద్ధం
- డీఎంకేలో కలవరం
సాక్షి, చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు శిక్ష పడ్డ వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని రాజకీయ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలచుకోవాలనుకున్న డీఎంకే వర్గాలకు మారన్ బ్రదర్స్ రూపంలో చిక్కులు ఎదురుకానున్నాయి. ఎయిర్ సెల్, మ్యాక్సిస్ ఒప్పంద వ్యవహారం ఉచ్చు మారన్ బ్రదర్స్ మెడకు చుట్టుకుంటోంది. వారికి సంబంధించిన రూ. 742 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేయడమే లక్ష్యంగా డీవీఏసీ సన్నద్ధం అవుతోంది. దేశాన్ని కుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో డీఎంకే నేతల ప్రమే యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కేసుతో పాటుగా మనీలాండరింగ్ వ్యవహారం ఆ పార్టీ అధినేత కరుణానిధి గారాల పట్టి కనిమొళి, మాజీ మంత్రి ఎ.రాజాపై సీబీఐ అభియోగాలు మోపింది. అలాగే, కరుణానిధి మనవళ్లు మారన్ బ్రదర్స్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ల దుర్వినియోగం, ఎయిర్ సెల్, మ్యాక్సిస్ ఒప్పందాలు చుట్టుముట్టా యి.
ఈ అవినీతి ప్రభావంతో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే డీలా పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తమపై పడిన మచ్చల్ని చెరుపుకోవడంతోపాటు ప్రజ ల్ని ఆకర్షించి కోల్పోయిన వైభవాన్ని చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో ఆ పార్టీ అధినేత కరుణానిధి ఉన్నారు. అదే సమయంలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలు శిక్ష పడడం, ఆ పార్టీ వర్గాల వీరంగం, శాంతి భద్రతల క్షీణింపు వ్యవహారాల్ని అస్త్రంగా చేసుకుని రాజకీయ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలచుకునే పనిలో పడ్డారు. తమపై పడ్డ అవినీతి బురదను కడిగేసుకునేలా జయలలిత జైలు శిక్ష అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మార్కుల్ని కొట్టేయాలన్న కాంక్షతో ఉరకలు తీస్తున్న డీఎంకేకు మారన్ బ్రదర్స్ రూపంలో చిక్కులు ఎదురుకానున్నాయి.
ఆస్తుల జప్తునకు సన్నద్ధం
గతంలో చోటు చేసుకున్న ఎయిర్ సెల్, మ్యాక్సిస్ ఒప్పందాల్లో దయానిధి మారన్, కళానిధి మారన్ బ్రదర్స్‌పై సీబీఐ అభియోగాల్ని మోపిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించిన చార్జ్‌షీట్ సైతం కోర్టులో దాఖలైంది. ఈ ఒప్పందాల మేరకు రూ.742 కోట్ల మేరకు నగదు బదలాయింపులు జరిగినట్టు సీబీఐ స్పష్టం చేసింది. దీంతో డెరైక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రంగంలోకి దిగింది. ఇప్పటికే మారన్ బ్రదర్స్‌ను ఈ విభాగం అధికారులు విచారించారు.
అందులో లభించిన ఆధారాలు, సీబీఐ చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకుని తమిళనాడులోని మారన్ బ్రదర్స్‌కు చెందిన రూ.742 కోట్లు విలువైన ఆస్తుల్ని జప్తు చేసేందుకు డీవీఏసీ వర్గాలు కసరత్తు చేస్తున్నారుు. ఈ కేసు వ్యవహారంలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ప్రమేయంపై సైతం దృష్టి కేంద్రీకరించడంపై రాష్ట్రంలో చర్చ మొదలైంది. ఈ ఆస్తుల జప్తు పర్వం మరికొద్ది రోజుల్లో జరగొచ్చన్న సంకేతాలు వెలువడడడంతో డీఎంకే వర్గాల్లో కలవరం మొదలైంది. మారన్ బ్రదర్స్ రూపంలో మళ్లీ తమ అధినేతకు చిక్కులు తప్పవేమోనంటూ కరుణ సేన పెదవి విప్పుతుండడం గమనార్హం.