చెన్నై : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి జయలలితపై డీఎంకే మరో అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను నిర్దోషిగా పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సమాయత్తమైంది. రాష్ట్రంలో అనేక ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలున్నా అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే ప్రతిష్టాత్మకరమైన సవాళ్లు సాగుతుంటాయి. అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షంలో కూర్చున్నా ఈరెండు పార్టీలే పంచుకుంటాయి.
కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని రెండు దఫాలు రాష్ట్రాన్ని ఏలిన డీఎంకేకు 2011 నాటి ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. అ తరవాత వరుసగా వచ్చిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు సైతం డీఎంకేకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. జయపై దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ చెన్నైలో సాగితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆరోపిస్తూ డీఎంకే పట్టుపట్టి మరీ విచారణను బెంగళూరు కోర్టుకు తరలించింది. కర్ణాటక ప్రత్యేక కోర్టు జయకు నాలుగేళ్ల జైలు శిక్ష వేయడంతో పదవీచ్యుతురాలైనారు. అంతేగాక మరో పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేసే అర్హతను జయ కోల్పోవాల్సి వచ్చింది. ఆశించినదే జరిగిందని డీఎంకే సంబరపడింది.
అన్నాడీఎంకే చుక్కానిలేని నావగా మారిపోవడంతో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు అధికారం ఖాయమనే ధీమాలో కరుణానిధి ఉండిపోయారు. అయితే అంతలోనే సీన్ తల్లకిందులైంది. తనపై వచ్చిన తీర్పుపై కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసిన అనూహ్యరీతిలో జయలలిత నిర్దోషిగా బైటపడింది. మళ్లీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టింది. జయ అవినీ తే ప్రధాన అస్త్రంగా రాబోయే ఎన్నికల్లో రంగంలోకి దిగాలని ఆశించిన డీఎంకే భంగపడింది. సాక్షాత్తు కోర్టే జయను నిర్దోషిగా ప్రకటించడంతో డీఎంకేకు ప్రచారాస్త్రం కరువైంది.
ఆర్కేనగర్‌లో జరుగుతున్న ఉప ఎన్నికలో జయపై పోటీ పెట్టేకంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే పీఠం ఎక్కకుండా నిలువరించడమే ముఖ్యమని డీఎంకే అభిప్రాయపడింది. కర్ణాటక హైకోర్టు తీర్పుపై అక్కడి ప్రభుత్వం అప్పీలు చేయాలని డీ ఎంకే డిమాండ్ చేసింది. జయ కేసులో కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టులో అప్పీలు చేసినా డీఎంకే తృప్తి చెందలేదు. జయ ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని గత నెల నిర్వహించిన పార్టీ కార్యదర్శుల సమావేశంలో తీర్మానించారు.
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కుమారస్వామి జయ ఆస్తులను సక్రమంగా లెక్కకట్టలేదంటూ డీఎంకే పార్టీ తమ న్యాయవాదులను పురమాయించింది. కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని దగ్గర ఉంచుకుని డీఎంకే సీనియర్ న్యా యవాది వీజీ ప్రకాశం గత నెలరోజులుగా కసరత్తు చేసి పిటిషన్ సిద్ధం చేశారు.
లెక్కల తారుమారును రుజువుచేసేలా ఆధారాలతో కూడిన అప్పీలు ప్రతులను సిద్ధం చేశామని శుక్రవారం పార్టీ తెలిపింది. గత నెల పార్టీలో తీసుకున్న నిర్ణయం మే రకు ప్రధాన కార్యదర్శి అన్బళగన్ పేరున వచ్చేవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. జయను నిర్దోషిగా పేర్కొం టూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ఆ పిటిషన్‌లో కోరుతున్నట్లు పార్టీ అగ్రనేత ఒకరు మీడియాకు తెలిపారు.
జయపై డీఎంకే మరో అస్త్రం
Published Sat, Jun 27 2015 8:40 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement