సుప్రీంలో జయకు ఊరట
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తమిళనాడు మాజీ సీఎం జయలలితకు ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె బెయిల్‌ను కోర్టు మే 12 వరకు పొడిగించింది. కేసులో జయ అప్పీలుపై కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించే వరకు ఈ బెయిల్‌ను పొడిగిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ ఏకే మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం పేర్కొంది.
జయ అప్పీలుపై తీర్పు వెలువరించే గడువును ఈనెల 18 నుంచి మే 12కు పొడిగించేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి చేసిన అభ్యర్థనను కూడా కోర్టు అనుమతించింది. ఆయన తరఫున కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్ దరఖాస్తు దాఖలు చేశారు. భవిష్యత్తులో అవసరమైతే మరింత గడువు కోరుతూ దరఖాస్తు చేసుకునేందుకు కూడా ధర్మాసనం అనుమతించింది.