చెన్నై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా నిర్థారణ కావడంతో డీఎంకే సంబరాలు చేసుకుంటోంది. 1996లో అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే జయలలితపై ఆరోపణలకు సంబంధించి అప్పటి అధికార పార్టీ డీఎంకే విచారణకు ఆదేశించింది. అప్పటి నుంచి 18 ఏళ్ల పాటు పట్టువదలకుండా పోరాడిన కరుణానిధి పార్టీ... ఇప్పుడు పురచ్చితలైవి దోషిగా నిర్దారణ కావడంతో ఆనందంలో తేలిపోతోంది. మరోవైపు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి నివాసంలో పార్టీ ముఖ్యనేతలు సమావేశమై తాజా పరిణామాలపై చర్చలు జరిపారు.
కాగా గత రెండు ఎన్నికల్లో అన్నాడీఎంకే చావుదెబ్బ తిన్న డీఎంకే ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. 2011 అసెంబ్లీ ఎన్నికలు, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జయలలిత ధాటికి కరుణానిధి పార్టీ బొక్కబోర్లా పడింది. అంతేకాకుండా అమ్మ పథకాలతో ప్రజల్లో పరపతి పెంచుకుంటున్న జయలలితను దీటుగా ఎదుర్కొనేందుకు కూడా డీఎంకేకు బలం సరిపోవడం లేదు. ఇలాంటి స్థితిలో పార్టీని కాపాడుకుంటూ, ప్రజలకు చేరువయ్యేందుకు ఇప్పుడు డీఎంకేకు ఓ బలమైన ఆయుధం దొరికినట్లు అయింది.
జయలలిత అక్రమాలకు పాల్పడినట్లు కోర్టే స్వయంగా పేర్కొనందున ఇప్పుడు అదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి మళ్లీ మద్దతు సంపాదించాలనేది డీఎంకే నేతల ఎత్తుగడగా తెలుస్తోంది. ఇక కోర్టు జయను దోషిగా తేల్చటంతో డీఎంకే కార్యకర్తులు సంబరాలు చేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు.