ఎమ్మెల్యేగా జయలలితపై అనర్హత వేటు!
బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష ఖరారు కావడంతో ఆమెపై ఎమ్మెల్యేగా అనర్హత వేటుపడింది. ఈ అనర్హత వేటు తక్షణమే అమల్లోకి రానుంది. శనివారం బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఆమె సీఎం పదవికి అనర్హురాలు కానుంది. దీంతో పాటు ప్రజాప్రాతినిధ్యం చట్ట ప్రకారం ఆమె ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తాజా తీర్పుతో ఆమె పదేళ్ల పాటు రాజకీయ జీవితానికి దూరంగా ఉండనుంది. ఆమెకు నాలుగేళ్ల శిక్షతో పాటు వంద కోట్ల భారీ జరిమానాను కోర్టు విధించింది. ఇదే కేసులో దోషులుగా ఉన్న శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు కూడా నాలుగేళ్ల జైలు శిక్ష , ఒక్కొక్కరికి 10 కోట్ల జరిమానా విధించింది.
డీఏంకే హయాంలో 1996లో జయపై అక్రమాస్తుల కేసు నమోదైంది. 1991-96 మధ్యకాలంలో తమిళనాడు సీఎంగా ఉన్న సమయంలో అక్రమాస్తులు కూడబెట్టారని జయపై ఆరోపణలు వెలువత్తాయి.1996లో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యం స్వామి ఆమెపై దర్యాప్తు చేయాలని కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణకు చేపట్టాల్సిందిగా కోర్టు ఆదేశించినా.. దర్యాప్తుకు మాత్రం సుదీర్ఘ సమయం పట్టింది.