సాక్షి, ముంబై: పాఠశాల విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని నగరంలో భారీ వర్షాలు కురిసినప్పుడు తాము బస్సులు నడపబోమని స్కూల్ బస్ ఓనర్స్ అసోసియేషన్ (ఎస్‌బీఓఏ) స్పష్టం చేసింది. వర్షాకాలంలో కొన్ని ప్రాంతాల్లో వరద ముంపు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఆయా పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను పాఠశాల బస్సులో పంపేందుకు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఏఏ ప్రాంతాల్లో నీటి నిల్వలు ఎక్కువగా నమోదవుతాయో, ఏయే రోడ్లపై గుంతలు ఎక్కువగా ఉంటాయో ఆయా ప్రాంతాల్లోని పాఠశాలకు బస్సులను నడపబోమని ఎస్‌బీఓఏ స్పష్టం చేసింది. ప్రమాదాలను నివారించే ముఖ్య ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్‌బీఓఏ ప్రతినిధి ఒకరు తెలిపారు. పొవై, విలేపార్లే, లోఖండ్‌వాలా, కుర్లా, ధారావి తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు ఎక్కువగా నిలువ ఉంటుందని, దీంతో సదరు పాఠశాల విద్యార్థులకు బస్సులు నడపబోమని వారు తెలిపారు.
ఇందుకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులకు మొబైల్ ఫోన్ల ద్వారా సమాచారం కూడా అందజేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా హైటైడ్ సమయంలో అసలు బస్సు సేవలు అందించేది లేదంటూ స్పష్టం చేశారు. ప్రభుత్వంతోపాటు బీఎంసీ కార్పొరేషన్ కూడా రోడ్లపై ఏర్పడిన గుంతలతో పిల్లల జీవితాలను రిస్క్‌లో పెడుతోందని ఆరోపించారు. రోడ్లపై ఏర్పడిన గుంతలతో వర్షాకాలంలో పాఠశాలల బస్సుల్లో విద్యార్థులను తరలించడం కష్టంగా మారుతోందని, వాహనాలపై ఎక్కువ ఒత్తిడి పెరుగుతోందని ఎస్‌బీఓఏ అధ్యక్షుడు అనిల్ గార్గ్ పేర్కొన్నారు. భారీవర్షాలు పడేటప్పుడు రోడ్లపై చెట్లు విరిగి పడడం వంటి కారణాల వల్ల వాహనాలు ముందుకు కదలని పరిస్థితి నెలకొంటోందని తెలిపారు.
ప్రతి వర్షాకాలంలో వాటర్ లాగింగ్ సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సరైన పరిష్కారమే లభించడం లేదని వారు వాపోయారు. అంతేకాకుండా పాఠశాల బస్సుల్లో విద్యార్థులను ఎక్కించుకొని గుంతలు ఏర్పడిన రోడ్లపై వెళ్లడం వల్ల వీటి నిర్వహణకు అయ్యే ఖర్చు మామూలు రోజుల కంటే కూడా నాలుగు రెట్లు ఎక్కువ అవుతోందని ఆయన తెలిపారు. ఏ చిన్న ప్రమాదం సంభవించినా అందుకు బస్సు యజమానులు, డ్రైవర్లనే బాధ్యులు చేస్తారని, రోడ్లపై ఏర్పడిన గుంతలపై కార్పొరేషన్ అధికారులను నిలదీయరని ఆరోపించారు. ఇలాంటి రోడ్లపై ప్రయాణం చేయడం ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నట్లే అవుతుందని వారు అభిప్రాయపడ్డారు.
ఇదిలా వుండగా, తమకు ఈ విషయమై ఎస్‌బీఓఏ ఎలాంటి సమాచారం అందించలేదని పాఠశాల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. వర్షం పడినట్లయితే తమ పిల్లలను పంపించ వద్దని తల్లిదండ్రులకు కూడా సూచించామని పాఠశాలల యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించి ఎస్‌బీఓఏ తమకు సమాచారం అందించిన వెంటనే తాము కూడా ఆచరిస్తామని పొవై పాఠశాల ప్రిన్సిపల్ ఎస్.ఎం.శెట్టి తెలిపారు.
వర్షమొస్తే ‘నో బస్’!
Published Sun, Jul 27 2014 10:41 PM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM
Advertisement