
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : మరణదండనను అమలు పర్చేందుకు కొత్త మార్గాలను వెతకాలని సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మెడకు తాడు వేసి ఉరి తీయడం క్రూరమైన పద్దతని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మరణంలో శాంతి ఉండాలని శతాబ్దాలుగా చెబుతున్నా.. అది మాటలకే పరిమితమైందని పేర్కొంది.
ఈ విషయంపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సాయం తీసుకున్న సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఉరి శిక్షకు ప్రత్యామ్నాయాన్ని సూచించాలని సదరు నోటీసుల్లో కోర్టు పేర్కొంది. ఉరి శిక్ష అమలులో దోషి తీవ్రమైన బాధను అనుభవిస్తారని ఈ సందర్భంగా చెప్పింది. 30 ఏళ్ల క్రితం తామే(సుప్రీం కోర్టు) ఉరి శిక్షను అమలు చేయాలని తీర్పు ఇచ్చిన విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. నిరంతరం మార్పుకు చోటిచ్చే భారతీయ రాజ్యాంగంలో మరణ దండనను ఉరి శిక్ష ద్వారా అమలు చేయడం సబబు కాదని పేర్కొంది.