లోక్‌సభలో నిరసన తెలుపుతున్న విపక్ష సభ్యులు
న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లపై వరుసగా రెండో రోజు పార్లమెంటు ఉభయసభల్లో గందరగోళం చెలరేగింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న, సమర్ధిస్తున్న వర్గాల మధ్య ఈశాన్య ఢిల్లీలో జరిగిన తీవ్ర స్థాయి అల్లర్లపై పార్లమెంట్లో చర్చ జరిపేందుకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ.. విపక్షం ఆందోళనను విరమించలేదు.
లోక్‌సభలో..
ఢిల్లీ అల్లర్లపై తక్షణమే చర్చ జరగాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్‌సహా విపక్ష సభ్యులు మంగళవారం సభ కార్యకలాపాలను స్తంభింపజేశారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, డీఎంకే సహా పలు విపక్ష పార్టీల సభ్యులు ఢిల్లీ అల్లర్లపై వెంటనే చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ నినాదాలు ఇవ్వసాగారు. జీరో అవర్‌లో ఈ అంశాలను లేవనెత్తాలని, ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించనివ్వాలని స్పీకర్ కోరినా వారు పట్టించుకోలేదు. మార్చి 11న చర్చ జరుగుతుందని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించినప్పటికీ.. విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఇవ్వసాగారు. కొందరు సభ్యులు స్పీకర్ పోడియంకు దిగువన ఉండే సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ ఎన్‌క్లోజర్‌ను గట్టిగా తట్టడం కనిపించింది. ‘దేశ ప్రయోజనాల కోసం మనం పనిచేస్తున్నాం. దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని హోలీ పండుగను శాంతి, సౌభ్రాతృత్వాలతో జరుపుకుందాం.
ఆ తరువాత మార్చి 11న ఢిల్లీ అల్లర్లపై చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అయినా, గందరగోళం ఆగలేదు. రెండు పర్యాయాలు వాయిదా పడిన అనంతరం, మధ్యాహ్నం సభ మరోసారి సమావేశమైంది. కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి వెల్‌లో అధికార పక్ష సభ్యులు కూర్చున్న వైపు వెళ్లడంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మళ్లీ గొడవ ప్రారంభమైంది. చౌధురి తరహాలోనే అధికార పక్షంవైపు వెళ్లేందుకు ఇతర విపక్ష సభ్యులు చేసిన ప్రయత్నాలను బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఆధిర్ రంజన్ చౌధురితో పశ్చిమబెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీ గట్టిగా వాదించడం, వారికి కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సర్దిచెప్పడం కనిపించింది. ఈ సమయంలోనే పలువురు కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఒకరినొకరు తోసుకున్నారు. గందరగోళం కొనసాగడంతో సభను స్పీకర్ బుధవారానికి వాయిదా వేశారు. ఈ గందరగోళం మధ్యనే ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ సహకార బ్యాంకులను పటిష్టపరిచేందుకు ఉద్దేశించిన బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
రాజ్యసభలో..
ఢిల్లీ అల్లర్లపై నిరసనల నేపథ్యంలో రెండు పర్యాయాలు వాయిదా పడిన అనంతరం రాజ్యసభ మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ సమావేశమైంది. అప్పుడు, రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. ప్రపంచమంతా చర్చిస్తున్న, ఆందోళన వ్యక్తం చేస్తున్న ఢిల్లీ అల్లర్లపై వెంటనే సభలో చర్చ జరపకపోవడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని అధికార పక్ష నేత తావర్ చంద్ గహ్లోత్ ప్రకటించారు. చైర్మన్ వెంకయ్యనాయుడుని సంప్రదించి చర్చ జరిగే తేదీని ప్రకటిస్తామని డెప్యూటీ చైర్మన్ హరివంశ్ తెలిపారు. గందరగోళం కొనసాగుతుండటంతో హరివంశ్ సభను బుధవారానికి వాయిదా వేశారు. అంతకుముందు, ఉదయం ఆర్థిక శాఖకు సంబంధించిన కొన్ని పత్రాలను సభ ముందుంచేందుకు ఆ శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ లేచి నిల్చున్న సమయంలోనూ విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు.
సమావేశంలో నడ్డా, అమిత్ షాలతో మోదీ
‘భారత్ మాతా కీ జై’ అంటే నేరమా?
భారత్ మాతా కీ జై అని నినదిస్తే నేరమని కొందరు అంటున్నారని∙మోదీ వ్యాఖ్యానించారు. ‘భారత్‌మాతా కీ జై’ నినాదంలోనూ మాజీ ప్రధాని మన్మోహన్‌కు తప్పు కనిపిస్తోందని, ఆ నినాదాన్ని కూడా ఆయన అనుమానంగా చూస్తున్నారని విమర్శించారు. బీజేపీ పార్లమెంటరీ భేటీని ఉద్దేశించి మంగళవారం మోదీ ప్రసంగించారు. ‘స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచాక కూడా.. భారత్ మాతా కీ జై అని నినదిస్తే నేరం అంటున్నారు. అదీ ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి అలా అనడం మరీ దురదృష్టకరం. ప్రతీ దేశభక్తుడు బాధపడే విషయమిది’ అని మోదీ వ్యాఖ్యానించారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఆయన విమర్శించారు. సమాజంలో సామరస్యతను పెంపొందించే విషయంలో మార్గదర్శులుగా నిలవాలని ఆయన బీజేపీ ఎంపీలను కోరారు. ఢిల్లీ అల్లర్ల విషయంలో బీజేపీ విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment