
మంత్రిగారి కోసం ముగ్గుర్ని దించేశారు..
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా మరోసారి విఐపి కల్చర్ వివాదంలో ఇరుక్కుంది. అమాత్యుల అభిమానం కోసం, ప్రాపకం కోసం పాకులాడి ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేసిన సంఘటన మరొకటి చోటుచేసుకుంది. కేంద్ర సహాయమంత్రి కిరణ్ రిజిజూ, జమ్ముకాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ కోసం ముగ్గురు ప్రయాణీకులను ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్దాక్షిణ్యంగా దించి వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్ కోసం విమానాన్ని ఆలస్యంగా నడిపి ప్రయాణీకులను అసహనానికి కారణమైన విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో ఈ నెల 24న జరిగిన ఈ దారుణం సోషల్ మీడియా ద్వారా వెలుగు చూసింది.
లేహ్ నుండి ఢిల్లీకి వెళుతున్న విమానానికి టిక్కెట్లు బుక్ చేసుకున్న ముగ్గురు ప్రయాణికులను కాదని కేంద్రమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఆ సీట్లను కేటాయించారు. చిన్న పాప ఉందని,టిక్కెట్లు ఉన్నా ఎలా దించివేస్తారని ప్రయాణికులు వాదించినా వినిపించుకోలేదు. పైగా విమానాన్ని అనుకున్న సమయం కంటే ముందుగానే నడిపారు. దీనిపై కేంద్రమంత్రి రిజుజూ స్పందించారు. తమ కోసం ముగ్గురు ప్రయాణికులను దించివేసిన విషయం తమకు తెలియదనీ, అలా జరిగి ఉంటే చాలా తప్పనీ, అసలు ఈ విషయాలేవీ తమ దృష్టికి రాలేదన్నారు. తమ ప్రయాణ వ్యవహారాలను సిబ్బందే చూసుకున్నారని మంత్రి వివరణ ఇచ్చారు.
మరోవైపు టిక్కెట్లు తీసుకున్న తమను ఎలా దించివేస్తారని బాధిత ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైలట్ కూడా తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. వీరంతా ఎయిర్ ఇండియాకు చెందిన ఉద్యోగి సింగ్ కుటుంబ సభ్యులు. దీనిపై విమర్శలు చెలరేగడంతో దిగొవచ్చిన ఎయిర్ ఇండియా ఎట్టకేలకు ప్రయాణీకులను క్షమాపణలు కోరింది. కాగా మంత్రిగారి కోసం ముగ్గురిని దించేస్తున్నప్పుడు ఓ ప్రయాణికుడు ఈ తతాంగాన్ని అంతా కెమెరాలో చిత్రీకరించాడు. సోషల్ మీడియాలో రిజిజు నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వీఐపీ కల్చర్ పై నెటిజన్లు మండిపడుతున్నారు.