సెక్యూరిటీ గార్డుల కనీస వేతనం రూ.15,000
కేంద్ర మంత్రి దత్తాత్రేయ వెల్లడి
న్యూఢిల్లీ: సెక్యూరిటీ గార్డుల కనీస వేతనాన్ని త్వరలో రూ.15,000 చేయనున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ బుధవారమిక్కడ చెప్పారు. ప్రైవేటు సెక్యూరిటీ పరిశ్రమపై ‘ఫిక్కీ’ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సెక్యూరిటీ గార్డులను నైపుణ్యం గల కార్మికులుగా.. గార్డుల పర్యవేక్ష కులు, ఆయుధాలు కలిగిఉండే గార్డులను అధిక నైపుణ్యం గల కార్మికులుగా గుర్తించి వారికి వరుసగా రూ.15 వేలు, రూ.25 వేల కనీస వేతనం అందేలా చూస్తామని దత్తాత్రేయ తెలిపారు.
ఈ చర్యతో దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా 50 లక్షల మందికి సెక్యూరిటీ గార్డులకు, పరోక్షంగా 2.5 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ఆయన వివరించారు. చట్టాల సరళీకరణలో భాగంగా ఇప్పుడున్న 44 కార్మిక చట్టాలను సంలీనం చేసి నాలుగుకు తగ్గించామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన బిల్లును త్వరలోనే మంత్రివర్గం ముందుకు తెచ్చి, వచ్చే సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెడతామన్నారు.