Union labor minister
-
పీరియడ్స్‌లో వేతన సెలవులివ్వాల్సిందే
సంబాల్పూర్: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలకు పీరియడ్స్ సమయంలో వేతనంతో కూడిన సెలువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒడిశాలోని సంబాల్పూర్ పట్టణ యువతులు ఆన్లైన్ ఉద్యమం ప్రారంభించారు. ఈ విషయంలో తగిన మార్గదర్శకాలుజారీ చేయాలని ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఒడిశా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుశాంత్ సింగ్‌కు వినతి పత్రం సమర్పించారు. పీరియడ్స్ సమయంలో మహిళలు మానసికంగా, శారీరకంగా ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటారని, వారికి తగిన విశ్రాంతి అవసరమని అన్నారు. అందుకే వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని కోరారు. కనీసం ఒక్క రోజైనా సెలవు ఇవ్వాలని చెప్పారు. ఎందుకంటే 99 శాతం మంది మహిళలు గరిష్టంగా 24 గంటలపాటు నొప్పితో బాధపడుతూ ఉంటారని గుర్తుచేశారు. భారత్‌లో ప్రస్తుతం 12 కంపెనీలు మహిళలకు రుతుస్రావం సమయంలో పెయిడ్ లీవులు మంజూరు చేస్తున్నాయి. తమ ఉద్యమానికి మహిళల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోందని, ఇది సిగ్గు పడాల్సిన విషయం కాదని రంజితా ప్రియదర్శిని స్పష్టం చేశారు. -
సంఘటిత రంగంలో పెరుగుతున్న ఉపాధి
న్యూఢిల్లీ: సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు దేశంలో బలపడుతున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. 2021 డిసెంబర్ త్రైమాసికంలో తొమ్మిది పరిశ్రమలలో దాదాపు 3.14 కోట్ల మంది కార్మికులు ఉపాధి పొందారని, ఇది సంఘటిత రంగంలో ఉపాధిలో పెరుగుతున్న ధోరణిని సూచిస్తోందని ఆయన ఒక ట్వీట్ చేశారు. 2021 సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ సంఖ్య 3.10 కోట్లని తెలిపారు. ఈ మేరకు కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ త్రైమాసిక (అక్టోబర్–డిసెంబర్) సర్వే నివేదికలోని గణాంకాలను ఆయన ఉటంకించారు. గురువారం విడుదలైన నివేదికకు సంబంధించి ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► తొమ్మిది రంగాలు– తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, విద్య, ఆరోగ్యం, వసతి/రెస్టారెంట్లు, ఐటీ/బీపీఓ, ఆర్థిక సేవల విభాగాల్లో 10 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్న సంస్థలకు సంబంధించి ఉపాధి డేటా ప్రాతిపదికన ఈ గణాంకాలు వెలువడ్డాయి. మొత్తం ఉపాధి రంగంలో ఈ తొమ్మిది రంగాల వాటా దాదాపు 85 శాతం. ► నివేదిక ప్రకారం అంచనా వేసిన మొత్తం కార్మికుల సంఖ్యలో దాదాపు 39 శాతం వాటాతో తయారీ రంగం మొదటి స్థానంలో నిలిచింది. తరువాత విద్యా రంగం 22 శాతంతో ఉంది. సమీక్షా కాలంలో తయారీ రంగంలో అత్యధికంగా 124 లక్షల మంది కార్మికులు ఉన్నారు. విద్యా రంగం 69.26 లక్షల మందిని కలిగిఉంది. ► వాటి తర్వాత ఐటీ/బీపీఓలు (34.57 లక్షలు), ఆరోగ్యం (32.86 లక్షలు), వాణిజ్యం (16.81 లక్షలు), రవాణా (13.20 లక్షలు), ఆర్థిక సేవలు (8.85 లక్షలు), వసతి/రెస్టారెంట్లు (8.11 లక్షలు), నిర్మాణ (6.19 లక్షలు) రంగాలు ఉన్నాయి. ► దాదాపు అన్ని (99.4 శాతం) విభాగాలు వేర్వేరు చట్టాల క్రింద నమోదయ్యాయి. ► మొత్తంమీద, దాదాపు 23.55 శాతం యూనిట్లు తమ కార్మికులకు ఉద్యోగ శిక్షణను అందించాయి. తొమ్మిది రంగాల్లో ఆరోగ్య విభాగంలోని 34.87 శాతం యూనిట్లు ఉద్యోగ శిక్షణను అందించగా, ఐటీ/బీపీఓల వాటా ఈ విషయంలో 31.1 శాతంగా ఉంది. ► కార్మిక మంత్రిత్వశాఖ నియంత్రణలో లేబర్ బ్యూరోతో ఈ సర్వే జరిగింది. వ్యవసాయేతర సంస్థల్లోని మొత్తం ఉపాధిలో ఎక్కువ భాగం ఈ తొమ్మిది ఎంపిక చేసిన రంగాలదే కావడం గమనార్హం. వ్యవస్థీకృత, అసంఘటిత విభాగాలలో ఉద్యోగాలు, నియామకాలకు సంబంధించి ఈ సర్వే నిర్వహణ జరుగుతుంది. -
ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారనడం అవివేకం: దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: సెప్టెంబర్ 17ను విమోచన దినంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరితే మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించడం అవివేకమని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో వర్కర్స్ ఎడ్యుకేషన్ డే కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు విమోచన దినాన్ని నిర్వహిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడానికి అభ్యంతరం ఏమిటి అని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి, ఓట్ల కోసం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం లేదని మండిపడ్డారు. -
సెక్యూరిటీ గార్డుల కనీస వేతనం రూ.15,000
కేంద్ర మంత్రి దత్తాత్రేయ వెల్లడి న్యూఢిల్లీ: సెక్యూరిటీ గార్డుల కనీస వేతనాన్ని త్వరలో రూ.15,000 చేయనున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ బుధవారమిక్కడ చెప్పారు. ప్రైవేటు సెక్యూరిటీ పరిశ్రమపై ‘ఫిక్కీ’ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సెక్యూరిటీ గార్డులను నైపుణ్యం గల కార్మికులుగా.. గార్డుల పర్యవేక్ష కులు, ఆయుధాలు కలిగిఉండే గార్డులను అధిక నైపుణ్యం గల కార్మికులుగా గుర్తించి వారికి వరుసగా రూ.15 వేలు, రూ.25 వేల కనీస వేతనం అందేలా చూస్తామని దత్తాత్రేయ తెలిపారు. ఈ చర్యతో దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా 50 లక్షల మందికి సెక్యూరిటీ గార్డులకు, పరోక్షంగా 2.5 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ఆయన వివరించారు. చట్టాల సరళీకరణలో భాగంగా ఇప్పుడున్న 44 కార్మిక చట్టాలను సంలీనం చేసి నాలుగుకు తగ్గించామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన బిల్లును త్వరలోనే మంత్రివర్గం ముందుకు తెచ్చి, వచ్చే సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెడతామన్నారు. -
తెలంగాణలో ఎయిమ్స్‌కు కృషి
♦ ఈ ఏడాది నుంచే భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ: దత్తాత్రేయ ♦ వైద్య, ఆరోగ్య పరిస్థితులపై మంత్రి లక్ష్మారెడ్డి, అధికారులతో సమీక్ష సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్)ను తెలంగాణలో ఏర్పాటు చేసేలా కృషిచేస్తానని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఎయిమ్స్ ఏర్పాటుకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య పరిస్థితులపై ఆదివారం మంత్రి లక్ష్మారెడ్డి, ఉన్నతాధికారులతో ఈఎస్ఐసీ కార్యాలయం లో దత్తాత్రేయ సమీక్షించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా వంటి జ్వరాల బారిన పడి ఏటా పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారని వ్యాఖ్యానించా రు. ఇక బస్తీల్లో ప్రజలకు అంటువ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని... రాష్ట్రాలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలోని వైద్యకళాశాలల్లో విలువైన పరికరాలకు కేంద్ర నిధుల కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి ఆస్పత్రుల్లో కార్మికులకు వార్డులు కేటాయించాలనే ప్రతిపాదన వచ్చిందని, దీనిపై ఢిల్లీలో ఉన్నతాధికారులతో చర్చించి ప్రకటిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో పదిశాతం మంది కేన్సర్ వ్యాధిగ్రస్తులున్నారని, వారికి మెరుగైన చికిత్స అందజేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. కేన్సర్ ఆస్పత్రుల్లో ట్రామా కేర్ సెంటర్, టీబీ స్కాన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. అసంఘటిత కార్మికులందరికీ ఈఎస్ఐ.. అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ విడతల వారీగా ఈఎస్ఐ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు దత్తాత్రేయ చెప్పారు. ఈ ఏడాది నుంచే భవన నిర్మాణ రంగంలోని కార్మికులకు ఈఎస్ఐ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా భవన నిర్మాణాలకు సంబంధించి సెస్ రూపంలో రూ.21వేల కోట్లు వసూలయ్యాయన్నారు. కానీ అందులో రూ.3వేల కోట్లు మాత్రమే కేంద్రానికి చేరాయని, మిగతా నిధులు రాష్ట్రాల వద్దే ఉండిపోయాయని... ఆ నిధులన్నీ కేంద్రానికి చేరినట్లయితే మంచి సంక్షేమ పథకాలు అందించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల్లో ఈఎస్ఐ బ్లాకులు ఏర్పాటు చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. కేంద్రం సహకారంతో ఆస్పత్రులన్నింటినీ బలోపేతం చేస్తామని చెప్పారు. ఈ సమీక్షలో నిమ్స్ డెరైక్టర్ కె.మనోహర్, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జీవీఎస్ మూర్తి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్ఎన్జే కేన్సర్ ఆస్పత్రి సూపరిటెండెంట్ జయలలిత తదితర అధికారులు పాల్గొన్నారు.