పట్టుపడకుండా నంబర్ల జంబ్లింగ్
శేఖర్‌రెడ్డి కరెన్సీ వ్యవహారంలో బ్యాంకు అధికారుల తెలివి
► కేసు విచారణకు వందమందితో బృందాన్ని ఏర్పాటు చేసిన సీబీఐ
సాక్షి ప్రతినిధి, చెన్నై: కాంట్రాక్టర్‌గా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో చక్రం తిప్పిన శేఖర్‌రెడ్డి కేసును ఛేదించేందుకు వందమందితో కూడిన అధికారుల బృందాన్ని సీబీఐ నియమించింది. ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా శేఖర్‌రెడ్డికి కోట్లాది రూపాయల కొత్త నోట్లు చేరేందుకు, నిందితులు పట్టుబడకుండా వరుస నంబర్ల జంబ్లింగ్ సలహా ఇచ్చి సహకరించిన బ్యాంకు అధికారులెవరో కనుగొనేందుకు ఈ బృందం పనిచేస్తోంది. చెన్నైలో స్థిరపడిన తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కాట్పాడికి చెందిన శేఖర్‌రెడ్డి, ఆయన భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఈనెల 7న దాడులు జరపడం తెలిసిందే. చెన్నై, వేలూరు, కాట్పాడిల్లో జరిగిన సోదాల్లో రూ.170 కోట్ల నగదు, 177 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. (ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా నగదు)
పట్టుబడిన నగదులో రూ.70 కోట్లు కొత్త కరెన్సీ(రూ.2వేల నోట్లు) అని తెలుస్తోంది. చెన్నై బ్రోకర్ ద్వారా పాతనోట్లకు కొత్త కరెన్సీ పొందినట్లు శేఖర్ అంగీకరించారన్నారు. కరెన్సీ మార్పిడికి సహకరించారనే అనుమానంతో 50 మందిని విచారించారు. ఐటీ అధికారి ఒకరు మాట్లాడుతూ పట్టుబడిన సొమ్మంతా తనదేనని శేఖర్‌రెడ్డి అంగీకరించినందున తగిన పన్ను వసూలు చేయడం మినహా ఈ కేసులో తాము అంతకంటే ముందుకెళ్లలేమని చెప్పారు. ప్రింటింగ్ ప్రెస్ నుంచి కరెన్సీని రిజర్వు బ్యాంకుకు అప్పగించడం ఆనవాయితీ. అత్యవసర పరిస్థితుల్లో నేరుగా బ్యాంకులకూ పంపడం జరుగుతుందన్నారు.
పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో కొత్త కరెన్సీని సమకూర్చడంలో అత్యవసర పరిస్థితులు తలెత్తగా దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు బ్యాంకు అధికారులు ప్రెస్ నుంచే వచ్చిన కరెన్సీని నేరుగా శేఖర్‌రెడ్డికి చేరవేసినట్లు నమ్ముతున్నామన్నారు. ఐటీ, విజిలెన్స్, సీబీఐ అధికారుల కళ్లు కప్పేందుకే కొత్త కరెన్సీ నంబర్లను తెలివిగా జంబ్లింగ్ చేసినట్లు తెలిపారు.