కాంగ్రెస్ దేశం కోసం చాలా చేసింది:శివసేన
ముంబై: బీజేపీ, దాని సోదర సంస్థ , కీలక భాగస్వామి శివసేన మధ్య విభేదాలు తారాస్తాయికి చేరినట్టే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెద్దనోట్ల రద్దు తరువాత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వరసపెట్టి విమర్శలు గుప్పిస్తున్న శివసేన మరోసారి మోదీ సర్కార్‌పై విరుచుకుపడింది. ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ను ఉద్దేశించి మోదీ చేసిన రెయిన్ కోట్ వ్యాఖ్యల్ని ఖండించారు.
అలాగే స్వాతంత్ర్యం తరువాత కేంద్రంలో వరుస కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధించిన అభివృద్ధి పనులపై ప్రశంసలు గుప్పించడం విశేషం. అంతేకాదు మోదీ తన పాలనలో దేశాన్ని మరింత వెనక్కి తీసుకెళుతున్నారని మండిపడింది. డీమానిటైజేషన్ అనంతర గందరగో ళాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరంటూ మోదీపై ఆరోపణలు గుప్పించారు. అవినీతితో అంటకాగడం కూడా అవినీతి కిందికే వస్తుందంటూ శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో సంచలన వ్యాఖ్యలు చేసింది.
1971 యుద్ధంలో అప్పటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ పాకిస్తాన్ కు గట్టి బుద్ది చెప్పారని, అందుకే అటల్ బిహారీ వాజ్‌పేయి ఇందిరను దుర్గ అని ప్రశంసించారని రాసింది. జాతి వ్యతిరేకులపై కపటత్వాన్నిఆమె ఎపుడూ ప్రదర్శించలేదనీ, డీమానిటైజేషన్ తో పేదలకు కష్టాలు తెచ్చిపెట్టలేదని పేర్కొంది. బ్యాంకుల జాతీయంతో దేశ ఆర్థికవృద్ధికి తోడ్పడ్డారంది. అలాగే ఖలిస్తాన్ టెర్రరిస్టుల ఘాతుకానికి నేలకొరిగి.. దేశం ఉగ్రవాదులకు లొంగదనే గట్టి సంకేతాన్ని అందించారని ప్రశంసించింది. దేశకోసం ప్రాణాలను సైతం త్యాగం చేశారంటూ ఇందిరను సామ్నా కొనియాడింది.
అంతేకాదు కాంగ్రెస్ ప్రధానులు, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావుపై కూడా ప్రశంసలు కురిపించింది. బోఫోర్స్ ఆరోపణలు ఉన్నప్పటికీ దేశానికి కంప్యూటర్లను అందించిన, టెక్నాలజీ వృద్ధికి పునాదులు వేసిన ఘనత రాజీవ్ కే దక్కుతుందన్నారు. అలాగే ఆర్థిక సంక్షోభంనుంచి మన్మోహన్, పీవీ దేశాన్ని రక్షించారని తెలిపింది. అయితే ఈ 60 సంవత్సరాల అభివృద్ధిని మోదీ నాశనం చేస్తున్నారని దుయ్యబట్టింది. దేశాన్ని సోమాలియా, లేదా బురుండి స్థాయికి దిగజారుస్తున్నారని మండిపడింది. స్వాత్రంత్యానికి సూదిని కూడా తయారు చేసుకోలేని దేశం, గణనీయమైన పారిశ్రామిక వృద్దిని సాధించిందని రాసింది.