గుజరాత్‌కన్నా మహారాష్ట్రలోనే అభివృద్ధి: రాహుల్
రామ్‌టెక్ (మహారాష్ట్ర): గుజరాత్‌తో పోలిస్తే మహారాష్ట్ర అభివృద్ధిలో వెనకబడిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. అభివృద్ధి పథంలో గుజరాత్‌కన్నా మహారాష్ట్ర ఎంతో ముందంజలో ఉందని చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాగ్‌పూర్ జిల్లాలోని రామ్‌టెక్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు. గత 60 ఏళ్లలో తమ పార్టీ దేశాన్ని అభివృద్ధి చేయలేదంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. ఒకవేళ అదే నిజమైతే మహారాష్ర్ట ప్రస్తుతం అభివృద్ధిలో ముందడుగు ఎలా వేయగలిగిందని ప్రశ్నించారు. మహారాష్ట్రలో తమ ప్రభుత్వం అనుసరించిన జౌళి, పారిశ్రామిక విధానాల వల్ల 30 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు.
కొందరు నాయకులు గాంధీజీ గురించి మాట్లాడినా ఆయన సిద్ధాంతాలను మాత్రం పాటించరని పరోక్షంగా మోదీని విమర్శించారు. చైనా సైన్యం ఓవైపు సరిహద్దులో చొరబడుతుంటే మోదీ మాత్రం ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఉయ్యాల ఊగుతూ కూర్చున్నారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనాన్ని తీసుకొస్తామంటూ హామీ ఇచ్చిన మోదీ సర్కారు ఇప్పటివరకూ ఆ పని చేయలేకపోయిందని విమర్శించారు.