
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో పట్టు పెంచుకోవాలన్న బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో సామాజిక సమతూకం దెబ్బతింటుందని పేర్కొంటూ బెంగాల్‌లో రథయాత్రల నిర్వహణకు సుప్రీం కోర్టు మంగళవారం నిరాకరించింది. బీజేపీ రాష్ట్ర శాఖ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించుకోవచ్చని, ఈ దిశగా రాష్ట్ర అధికారుల నుంచి తాజా అనుమతులు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్ధానం సూచించింది.
సుప్రీం కోర్టు తన ఉత్తర్వులు జారీ చేస్తూ బెంగాల్‌లో రాష్ట్రవ్యాప్తంగా రథయాత్రలు నిర్వహించదలిస్తే సవరించిన యాత్ర ప్రణాళికలతో వాటికి తిరిగి అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. సవరించిన రథయాత్ర షెడ్యూల్‌ను అధికారులకు సమర్పించి అవసరమైన అనుమతులు కోరాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ బీజేపీ రాష్ట్ర శాఖను కోరింది.
భావప్రకటనా హక్కును దృష్టిలో ఉంచుకుని రథయాత్ర కోసం బీజేపీ దాఖలు చేసిన దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.కాగా బీజేపీ రథయాత్రలకు బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment