
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో రథయాత్రకు అనుమతి కోరుతూ బీజేపీ సోమవారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. తమ పార్టీ రథయాత్రకు అనుమతిస్తూ కలకత్తా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా బీజేపీ అప్పీల్ చేసుకుందని సుప్రీం కోర్టు అధికారిక రిజిస్ట్రీ పేర్కొంది. ఈ పిటిషన్‌ను కోర్టు పరిశీలిస్తోందని అధికారులు తెలిపారు. కాగా తాము దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై తక్షణం విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టుకు బీజేపీ విజ్ఞప్తి చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 42 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో రథయాత్ర చేపట్టాలని బీజేపీ భావించింది. ఈ రథయాత్రకు పార్టీ చీఫ్ అమిత్ షా పచ్చజెండా ఊపేలా సన్నాహాలు జరిపింది. యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే.. రథయాత్ర చేపట్టదలచిన ప్రాంతాలు అత్యంత సున్నితమైనవని, మత కలహాలకు ఆస్కారం ఉన్నందున అనుమతి ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. బీజేపికి అనుకూలంగా హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించినా. డివిజన్ బెంచ్ ఆ తీర్పును రద్దు చేయడంతో ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ సుప్రీంను ఆశ్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment