
పుస్తకాల బ్యాగ్ మోయలేకపోతున్నాం
ప్రెస్‌మీట్ పెట్టి బాధను వ్యక్తం చేసిన ఏడో తరగతి విద్యార్థులు
చంద్రపూర్(మహారాష్ట్ర): లెక్క కు మించి పుస్తకాలు... కిలోల కొద్దీ బరువు... బియ్యపు మూటలను తలపించే బ్యాగుల బరువులెత్తలేక విద్యార్థులు అల్లాడుతున్నారు. ఈ బాధను భరించలేకపోతున్నామంటూ ఇక్కడి విద్యానికేతన్ స్కూల్‌కు చెందిన ఇద్దరు ఏడో తరగతి విద్యార్థులు ప్రెస్ మీట్ పెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ‘మేం రోజూ 8 సబ్జెక్టులకు సంబంధించి కనీసం 16 పుస్తకాలు బడికి తీసుకెళ్లాల్సి వస్తోంది. ఒక్కోసారి ఈ సంఖ్య 18 నుంచి 20 వరకు ఉంటుంది. దాదాపు ఏడు కిలోల బరువున్న బ్యాగును భుజాన వేసుకొని మూడో అంతస్తులో ఉన్న తరగతి గదికి మోసుకెళ్లే క్రమం లో విపరీతంగా అలసిపోతున్నాం.
బ్యాగ్ బరువు తగ్గించమని మా ప్రిన్సిపాల్‌కు దీనిపై ఒకటిరెండుసార్లు విన్నవిం చినా ఫలితం లేదు.’ అంటూ ఇక్కడి ప్రెస్ క్లబ్‌లో వారు ఆవేదన వ్యక్తం చేశారు. పిరియడ్ల సంఖ్య తగ్గించాలని వారు కోరారు. అలాగే స్కూల్లో బ్యాగును తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఒకవేళ స్కూలు యాజమాన్యం ఈ అభ్యర్థనను పట్టించుకోకపోతే ఏం చేస్తారన్నదానికి... తమ డిమాండ్లు నెరవేరే వరకూ నిరాహార దీక్షకు దిగుతామని తేల్చిచెప్పారు.