చలి తీవ్రతకు ఉత్తరాది విలవిల
న్యూఢిల్లీ: ఎముకలు కొరికే చలిగాలులు, పొగ మంచు ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు చలి తీవ్రతకు గురువారం ఒక్క రోజే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే తొమ్మిది మంది మరణించగా.. పంజాబ్‌లో మరో ముగ్గురు చనిపోయారు.
జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లోని పర్వత ప్రాంతాలు మంచినీళ్లు సైతం గడ్డకట్టే స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరోవైపు పొగమంచు కారణంగా ఢిల్లీలో పలు విమాన సర్వీసులు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాధారణ ట్రాఫిక్‌కు కూడా ఆటంకాలు ఎదురయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో చలిగాలుల ప్రభావం అధికంగా ఉండటంతో ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు.
ఇక పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో పొగమంచు కారణంగా ట్రక్కు-జీపు ఢీకొని ముగ్గురు మరణించారు. మరోవైపు కశ్మీర్ లోయలో మైనస్ 3.9 డిగ్రీలు, లడఖ్‌లో మైనస్ పది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ప్రాంతంలోని ప్రఖ్యాత దాల్ సరస్సుతో పాటు చెరువులు కూడా గడ్డకట్టుకుపోయాయి.