నేను అమాయకుడిని.. కోర్టుపై నమ్మకముంది!
న్యూఢిల్లీ: సహోద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో కోర్టు సమన్లు ఎదుర్కొంటున్న ప్రముఖ పర్యావరణ వేత్త ఆర్కే పచౌరి తాజాగా స్పందించారు. ఈ కేసులో తాను అమాయకుడినని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇటీవల ఆయనపై పోలీసులు నమోదుచేసిన చార్జిషీట్‌ను ఢిల్లీ కోర్టు పరిగణనలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పచౌరికి వ్యతిరేకంగా కేసు విచారణను ముందుకుసాగించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో టెరి మాజీ చీఫ్ అయిన పచౌరి స్పందిస్తూ 'చార్జీషీట్‌లోని అభియోగాలను మాత్రమే కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అంతేకానీ నాకు వ్యతిరేకంగా తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు ఎక్కడా పేర్కొనలేదు. ఫిర్యాదుదారు చేసిన అభియోగాలపై ఏడాది పాటు సాగిన విచారణలో ఎలాంటి విషయాలు వెల్లడి కాలేదు' అని పేర్కొన్నారు. దేశ న్యాయవ్యవస్థపై తనకు సంపూర్ణ విశ్వాసముందని, తాను ఏ తప్పు చేయలేదని, అదే విషయం కోర్టు తీర్పు ద్వారా రుజువు అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇంధన వనరుల పరిశోధన సంస్థ (టెరి) అధిపతిగా ఉన్నప్పుడు ఆ సంస్థలోని ఓ మహిళా ఉద్యోగినిపై పచౌరి దాడి చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడే ఉద్దేశంతో ఆమెను వెంటాడాడని, ఆమె పరువుకు భంగం కలింగించేలా వ్యవహరించాడని ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు అభియోగాలు నమోదుచేశారు. 2015లో బాధితురాలిని లైంగికంగా వేధించినట్టు పచౌరి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.